కేరళలో మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఆ తరువాత జూన్ రెండో వారంలో ఏపీ, తెలంగాణలోకి ఆ రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు.
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. కాలు బయట పెడితే చర్మం కాలిపోతోంది. అంత వేడిగా వాతావరణం ఉంటోంది. దీంతో జనాలందరూ వర్షాలు ఎప్పుడు పడతాయా.. అని ఆశగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు రైతన్నలు కూడా ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో పంటలు వేసేందుకు వానల కోసం చూస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు ప్రారంభం కావడానికి మరో 5 రోజులు పట్టవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
కేరళలో మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఆ తరువాత జూన్ రెండో వారంలో ఏపీ, తెలంగాణలోకి ఆ రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. అంటే దాదాపుగా ఈ నెల 8వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని లక్షద్వీప్‌కు సమీపంలో ఉన్నాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.
ఇక ఇవాళ్టి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ చెబుతోంది. అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో జూన్ 5 నుంచి 7వ తేదీ వరకు వడగాలులు బాగా వీస్తాయని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ సారి జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య దేశవ్యాప్తంగా సరాసరిగా 96 వాతం వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణ భారత దేశంలో మాత్రం 97 శాతం వర్ష పాతం నమోదు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఏది ఏమైనా.. ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉన్నందున రైతన్నలకు కొంత మేలు జరుగుతుందనే చెప్పవచ్చు..!