తియ్య తియ్య‌ని బాదుషా.. తిందామా..!

-

భార‌తీయులు ఎప్ప‌టి నుంచో త‌యారు చేస్తున్న సంప్ర‌దాయ పిండి వంటల్లో బాదుషా కూడా ఒక‌టి. దీన్నే బాలుషాహి అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. సాధార‌ణంగా ఈ తీపి వంట‌కాన్ని చాలా మంది పండుగ‌ల‌ప్పుడు లేదా ఏదైనా శుభాకార్యాల స‌మ‌యంలో చేసుకుని తింటుంటారు. ఈ క్ర‌మంలోనే ఈ వంట‌కం రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. నోట్లో వేసుకుంటేనే క‌రిగిపోయేంత తియ్య‌గా బాదుషాలు ఉంటాయి. అయితే కొంచెం కష్ట‌ప‌డాలే గానీ మ‌నం కూడా అలాంటి అద్భుత‌మైన, తియ్య‌ని బాదుషాల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. మ‌రి బాదుషాల‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

బాదుషా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
పెరుగు – 3 టేబుల్ స్పూన్లు
బేకింగ్ సోడా – 1/4 టేబుల్ స్పూన్‌
ఉప్పు – 1/2 టేబుల్ స్పూన్‌
మైదా పిండి – 1 క‌ప్పు
చ‌క్కెర – ఒక‌టిన్నర క‌ప్పు
నీళ్లు – 1/2 క‌ప్పు
యాల‌కుల పొడి – 1/4 టేబుల్ స్పూన్

బాదుషాల‌ను త‌యారు చేసే విధానం:

ముందుగా ఒక గిన్నెలో కాస్త నెయ్యిని తీసుకోవాలి. దానికి పెరుగు క‌ల‌పాలి. అందులోనే బేకింగ్ సోడా, ఉప్పు, మైదా వేసి బాగా క‌లుపుకోవాలి. మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉండేలా చూసుకోవాలి. అప్ప‌టి వ‌ర‌కు దాన్ని బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మం నుంచి కొద్ది కొద్దిగా ఉండ‌ల‌ను తీసుకుని బాదుషాల‌లా త‌యారు చేసుకోవాలి. వాటికి మ‌ధ్య‌లో రంధ్రాల‌ను చేయాలి. అనంత‌రం వాటిని నూనెలో బంగారు వ‌ర్ణం వ‌చ్చే వ‌ర‌కు బాగా వేయించాలి. ఆ త‌రువాత వాటిని ప‌క్కన పెట్టాలి. అనంత‌రం చ‌క్కెర పాకం త‌యారు చేసుకోవాలి. అందులో యాల‌కుల పొడి క‌ల‌పాలి. వెంట‌నే ముందుగా వేయించి పెట్టుకున్న బాదుషాల‌ను వేయాలి. అలా కొంత సేపు ఉంచాక చ‌క్కెర పాకం మొత్తం బాదుషాల‌లోకి చేరుతుంది. అంతే.. తియ్య తియ్య‌ని బాదుషాలు రెడీ అవుతాయి. వాటిని ఎంచ‌క్కా ఆర‌గించ‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news