ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ చేస్తున్న ఆందోళనలు ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు అమరావతి జాయింట్ ఆక్షన్ కమిటీ రాజధాని జనభేరి పేరిట ఒక సభ నిర్వహిస్తోంది. ఈ సభకు అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మినహాయించి దాదాపు అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. అయితే ముందు నుంచి ఈ సభకు పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం చివరి నిమిషంలో పర్మిషన్ ఇచ్చింది.
అమరావతి ప్రాంతంలోని రాయపూడిలో ఈ సభ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారీ ఎత్తున జరగనుంది. అయితే రాజధాని జన భేరి సభకు ఇతర ప్రాంతాల వారికి అనుమతి లేదు కేవలం రాజధాని ప్రాంతానికి చెందిన వారు మాత్రమే ఈ సభలో హాజరుకావాలని పోలీసులు చెబుతున్నారు. కృష్ణా – గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లా నుంచి ఈ సభకు బయలుదేరిన రాజకీయ పార్టీల నేతలు అలాగే రైతు సంఘాల నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. అలాగే చాలా చోట్ల తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలకు చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సభకు తెలుగుదేశం తరఫున చంద్రబాబు, మరి కొందరు టిడిపి నేతలు పాల్గొననున్నారు. బిజెపి తరఫున ఇద్దరు నేతలు పాల్గొననున్నారు.