హైదరాబాద్: అమ్మల కడుపునకు కోత తప్పడం లేదు. నవమాసాలు బిడ్డను మోసి కష్టపడే అమ్మకి డెలివరీ సమయంతో కడుపు కోతే దిక్కయ్యేలా కనిపిస్తుంది పరిస్థితి. నార్మల్ డెలవరీ వరకు ఎదురు చూడకుండా సిజేరియన్ ఆపరేషన్లకే సై అంటున్నారు ప్రైవేట్ డాక్టర్లు. ప్రభుత్వం నార్మల్ డెలివరీ ప్రోత్సహించాలని చెబుతుంటే.. మరొపక్క సిజేరియన్ ఆపరేషన్లు ఊపందుకుంటున్నాయి. నార్మల్ డెలివరీకి అయ్యే ఖర్చు కంటే.. సిజేరియన్ వల్లే డబ్బులు ఎక్కువగా వస్తాయని ప్రైవేట్ డాక్టర్లు.. డెలివరీ వరకు ఆగకుండా ఏదో ఒక కారణం చెప్పి కడుపు కోసేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో డాక్టర్లు సిజేరియన్ లేకుండా బిడ్డను బయటకు తీయడం లేదనే పరిస్థితి దాపురించింది.
రాష్ట్రంలో ఈ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనే చెప్పుకోవచ్చు. సిజేరియన్ ఆపరేషన్లలో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 82.4 శాతంగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకటించింది. ఈ మేరకు తాజాగా 31 జిల్లాల వారీగా సర్వే వివరాలను వెల్లడించింది. అతి తక్కువగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 27.2 శాతంగా సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి.
ప్రైవేటు ఆస్పత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కరీంనగర్ జిల్లాలో ఏకంగా 92.8 శాతంగా సిజేరియన్ ద్వారానే తల్లులు బిడ్డను జన్మనిస్తున్నారు. ఆ తర్వాత జోగులాంబ గద్వాల జిల్లాలో 65.8 శాతంగా ఆపరేషన్లు జరుగుతన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లు అత్యధికంగా జనగామ జిల్లాలో 73 శాతం జరుగుతున్నాయి. అతి తక్కువగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 16.6 శాతం జరుగుతున్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 వెల్లడించింది.
బీపీ, షుగర్ వ్యాధులతో సతమతం..
ప్రస్తుతం అందరి జీవన శైలి మారింది. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య సమస్యలు పెరిగాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి రోగాలతో సతమతమవుతున్నారు. షుగర్ వ్యాధితో హైదరాబాద్ లో 26.8 శాతం మంది పురుషులు, 21.2 శాతం మహిళలు బాధపడుతున్నారు. అతి తక్కువగా కొమురంభీం జిల్లాలో పురుషులు 11.6 శాతం, మహిళలు 8.4 శాతం షుగర్ వ్యాధి బారిన పడ్డారు. హైదరాబాద్ లో బీపీ వల్ల పురుషులు 41.7 శాతం, మహిళల్లో 30.2 శాతం మంది బాధ పడుతున్నారు.