హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఇవాళ ఆ రాష్ట్రంలోని 68 నియోజకవర్గాలకు ఓటింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండటంతో ఇప్పటికే ఎన్నికల సిబ్బంది, పోలీసు బలగాలు ఆయా పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి.
రాష్ట్రంలోని మొత్తం ఓటర్లు 55,07,261 ఉండగా.. పురుష ఓటర్లు- 27,80,208, మహిళా ఓటర్లు 22,27,016, రాష్ట్రంలో తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లు- 1,86,681 ఉన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు- 7,881 ఉన్నాయి. ఓటింగ్ జరిగేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో పూర్తికానుంది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 35. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 43, కాంగ్రెస్ 22 స్థానాలు దక్కించుకున్నాయి. రాష్ట్రంలో రెండో సారి వరుసగా అధికారంలోకి రావాలని భాజపా తహతహలాడుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయం మేమే అంటూ ఆమ్ఆద్మీ పార్టీ అదృష్టం పరీక్షించుకుంటోంది.