హిండెన్‌బర్గ్‌ మరో సంచలన నివేదిక.. ఈసారి టార్గెట్ ఎవరంటే..?

-

అమెరికన్‌ షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ మరో సంచలన నివేదికను విడుదల చేసింది. మొన్న అదానీని టార్గెట్ చేసిన ఈ సంస్థ ఇప్పుడు ట్విటర్ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సేను టార్గెట్ చేసింది, డోర్సేకు చెందిన చెల్లింపుల సంస్థ ‘బ్లాక్‌’ భారీగా అక్రమాలకు పాల్పడిందని ఆరోపించింది. ఈ నివేదికకు సంబంధించిన లింక్‌ను హిండెన్‌బర్గ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్ చేసింది.

బ్లాక్‌ సంస్థ తన వినియోగదారుల సంఖ్యను ఎక్కువగా చూపిందని హిండెన్​బర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఖర్చుల వివరాలను తక్కువ చేసి చూపించిందని.. తద్వారా పెట్టుబడిదారులను మోసం చేసిందని ఆరోపించింది. బ్లాక్‌కు సంబంధించిన కీలకమైన విషయాలను తమ పరిశోధన ద్వారా గుర్తించినట్లు తన నివేదికలో వెల్లడించింది. రెండేళ్ల పాటు బ్లాక్‌ సంస్థపై పరిశోధనలు జరిపినట్లు చెప్పింది.

ఒక క్రమ పద్ధతిలో పెట్టుబడిదారుల నుంచి.. బ్లాక్‌ సంస్థ సాయం పొందిందని తెలిపింది. ఆవిష్కరణ పేరుతో వినియోగదారులను, ప్రభుత్వాన్ని సులభంగా మోసం చేయడమే బ్లాక్‌ వ్యాపారం వెనుకున్న అసలు ఉద్దేశమని వెల్లడించింది. బ్లాక్‌ సంస్థలోని నలభై నుంచి డెభై ఐదు శాతం ఖాతాలు నకిలీవని హిండెన్‌బర్గ్ తెలిపింది. ఆ సంస్థ మాజీ ఉద్యోగులు తమతో ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొంది. తాజాగా హిండెన్‌బర్గ్ విడుదల చేసిన నివేదిక అనంతరం.. ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో బ్లాక్ షేర్‌ ధర 18 శాతం పడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news