ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై రఘురామకృష్ణరాజు ఫైర్ అయ్యారు. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేరే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని రాజకీయా విలువల గురించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పదేపదే పేర్కొన్న విషయం తెలిసిందేనని రఘురామకృష్ణ రాజు గారు గుర్తు చేశారు. తాను విలువలకు కట్టుబడి ఉన్నట్లు, విలువల కోసమే బ్రతుకుతున్నట్లు… తాను పుట్టాకే విలువలు పుట్టాయన్నట్లుగా మాట్లాడే జగన్ మోహన్ రెడ్డి గారు టీడీపీ నుంచి తమ పార్టీలో చేరిన నలుగురిపై ఎందుకని అనర్హత చర్యలకు సిఫార్సు చేయలేదని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 22 మంది ఎమ్మెల్యేలకు ఒక క్యాంపు చొప్పున, ఎమ్మెల్యేలందరికీ మా సింహం క్యాంపులు నిర్వహించాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. కను సైగతో పార్టీ శాసనసభ్యులను శాసిస్తాడనుకునే ముఖ్యమంత్రి గారికి, హతవిధి… ఎంత కష్టం వచ్చిందని రఘురామకృష్ణ రాజు గారు ఎద్దేవా చేశారు. ఇద్దర నుంచి ముగ్గురు మంత్రులకు ముఖ్యమంత్రి గారు క్యాంపు బాధ్యతలను అప్పగించిన తర్వాత కూడా ఎమ్మెల్యేలను కాచుకోవలసిన దుస్థితి నెలకొందంటే ప్రజల్లో పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. వై నాట్ 175 అన్న తమ పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మడం లేదని, మన పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రత్యేక పంచాంగాలు అవసరం లేదని, మన కథ ముగిసిందని ప్రజలకు అర్థమయ్యిందని అన్నారు.