ఇప్పుడు ఏపీలో ఇంగ్లీష్ పై రగడ జరగుతోంది. దీని ద్వారా తెలుగు సంస్కృతి ఏమైపోతోందన్న ఆందోళన కనిపిస్తోంది. అయితే విచిత్రంగా హిందీ నుంచి దక్షిణాదికి ముప్పు ఉన్నట్టు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి…
బాలీవుడ్ పాట.. దక్షిణాదిని తొక్కేస్తోందట. ఎలాగంటారా.. బాలీవుడ్ పాట ద్వారా దక్షిణాదిలో హిందీ బాగానే పెరుగుతోందట. హిందీని అర్థం చేసుకునేవారి సంఖ్య పెరుగుతోందట. అదే సమయంలో దక్షిణాది భాషలు తగ్గిపోతున్నాయట. హిందీని బలవంతంగా రుద్దడంపై వ్యతిరేకత ఉన్నా దక్షిణాది రాష్ట్రాల్లో సైతం ఆ భాష బాగా వ్యాపిస్తోందట. అందుకు హిందీ సినిమా రంగం ప్రధానకారణమట . హిందీ పాట కలిగించిన మమకారం వల్లే ఇది సాధ్యమైందట. హిందీ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల సైతం ఆ భాషా వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తోందట. 1971లో హిందీ మాట్లాడే వారు దేశ జనాభాలో 36.99 శాతం ఉన్నారట. 2011 నాటికి వారు 48. 63 శాతానికి పెరిగారట.
బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం లాంటి ప్రధాన భాషలు మాట్లాడే ప్రజల శాతం మాత్రం తగ్గింది. 1971లో దేశ జనాభాలో తెలుగు మాట్లాడే వారి శాతం 8.1. 2011 నాటికి 6.70కి తగ్గిపోయింది. ఈ కారణంగానే కొందరు స్వభాషాభిమానుల్లో హిందీ పై ఒక భయం ఉంది. హిందీని రెండో భాషగానో, మూడో భాషగానో నేర్చుకుంటే.. ఎలాగూ నేర్చుకున్నారు.. కాబట్టి జాతీయ సమైక్యత పేరుతో భవిష్యత్తులో దానికే పెద్ద పీట వేస్తే.. మిగతా భాషలు క్రమేపీ ప్రాధాన్యాన్ని కోల్పోయే ప్రమాదం వస్తుందనేది ఆ భయం.
ఇన్ని భయాలు ఉన్న నేపథ్యంలో జాతీయ ఐక్యతను హిందీ భాషతో ముడి పెట్టే ఆలోచనకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది. జాతీయ భాష ఉంటేనే జాతీయవాదం ఉంటుందనే వాదనను ఏడు దశాబాల స్వతంత్ర భారత చరిత్ర నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఒక భాషతో భారత్ను ఎవరూ గుర్తించటం లేదు. బహుభాషల, బహుమతాల ప్రజలతో ఘనంగా వర్ధిల్లుతున్న స్వేచ్ఛా ప్రజాస్వామ్యంగానే దాన్ని గుర్తిస్తున్నారు.