ఈ అఘోర వీరభద్రున్ని దర్శిస్తే శత్రుబాధలు, కష్టాలు పోతాయట!

-

మానవుడి జీవితంలో అనేక కష్టాలు వస్తుంటాయి. అయితే అవి భరించగలిగే స్థాయిలో వుంటే ఆ మనిషి తట్టుకోగలడు. కానీ అవి తీవ్రంగా ఉంటే వారి బాధ చెప్పనలవి కాదు. అటువంటి కష్టాలలో శత్రుబాధలు, రకరకాల కష్టాలు. వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి మన ఇతిహాసాలు, పురాణాలు పలు మంత్ర, తంత్ర, జప, తప, దాన పరిహారాలను సూచించింది. అందులో కొన్ని ఆయా క్షేత్రాలను దర్శిస్తే పోతాయి. అటువంటి ఒక దేవతా మూర్తి గురించి తెలుసుకుందాం. వీరభద్రుడు. శివుని జట నుంచి ఉద్భవించిన మూర్తి. ఆయన దక్షయజ్ఞ సంహార సమయంలో ఆవిర్భవించాడు. వీరభద్రస్వామి శ్రీశైలానికి క్షేత్రపాలకుడు. ఇక్కడ ఆయన అనేక రూపాల్లో దర్శనమిస్తాడు.

ఊరిబయట బయలు వీరభద్రస్వామిగా, ఆలయంలో జ్వాలా వీరభద్రుడిగా, పుష్కరిణికి దగ్గరలో ఆరామవీరభద్రుడిగా, ఘంటామఠం వద్ద జటావీరభద్రుడిగా కనిపించే ఈ స్వామి మల్లికార్జున స్వామివారి ముఖమండపంలో ఎడమవైపు విశ్వరూపంతో దర్శనమిస్తారు. శివలింగ చిహ్న లాంఛితమైన కిరీటాన్ని తలపై ధరించి సర్వాభరణాలంకృతుడై, మోకాలివరకూ వేలాడే కపాలమాలతో, కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో గొడ్డలి అదేవిధంగా కుడివైపు పదిహేను చేతులతో, ఎడమవైపు పదిహేను చేతులతో అనేక ఆయుధాలను ధరించి ఈ స్వామి కనిపిస్తాడు. ఆయనకు కుడివైపు మేకతలతో దక్షుడు, ఎడమవైపు భద్రకాళి ఉంటారు. ముప్పై రెండు చేతుల వీరభద్రుని మయశిల్పగ్రంథం అఘోర వీరభద్రస్వామిగా కీర్తించింది.

ఈ స్వామిని దర్శించుకోవడం వలన సకల కష్టాలు, శతృబాధలు తొలగి, సర్వ అభీష్టాలు నెరవేరుతాయని శైవాగమాలలో చివరిదైన వాతులాగమం చెప్పింది. తనను సేవించిన వారికి సకలైశ్వర్యాలను, సుఖాన్ని, భుక్తిని, ముక్తిని ఇస్తాడని మంత్రశాస్త్రగ్రంథాలు పేర్కొన్నాయి. కార్తీకమాసంలో శ్రీశైల దర్శనమే మహా పుణ్యం, సకల శుభప్రదం. అందులోనూ ఈ అఘోర వీరభద్రున్ని దర్శించి స్వామికి తమ బాధలను తీర్చమని ప్రార్థిస్తే తప్పక అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news