‘‘పరిత్రాణాం సాధూనాం
వినాశాయచ దుష్కృతాం
సంభవామి యుగేయుగే’’
అని భగవద్గీతలో చెప్పినట్లు అనేక సందర్భాలలో నారాయణుడు శిష్టరక్షణ కోసం అనేకానేక అవతారాలు ఎత్తాడు. అయితే వాటిలో ప్రధానమైనవి దశావతారాలు. శ్రీ మహావిష్ణువు సాధు పరిరక్షణ, దుష్టశిఖన కోసం యుగయుగాన వివిధ అవతారాలలో అవతరించాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలు అని అంటారు. వాటిలో ముఖ్యమైన పది అవతారాలను దశావతారాలు అని అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారమే నారసింహ అవతారము. నరసింహస్వామి వైశాఖ శుద్ధ చతుర్థశి రోజున ఉద్భవించాడు ఈ రోజునే విష్ణు భక్తులు నృశింహ జయంతి, నారసింహ జయంతిగా ఉత్సవాలు జరుపుకుంటారు. స్వామివారు వైశాఖ మాస శుక్ల పక్షంలో పూర్ణిమ ముందు వచ్చే చతుర్థశి రోజు ఉభయ సంధ్యలకు నడుమ అనగా సాయంకాల సంధ్యా సమయంలో ఇటు పగలు గాని అటు రాత్రి కాని వేళలో ఇటు నరుడిగానూ కాక అటు జంతువుగా కాకుండా నారసింహ అవతారంలో ఉద్భవించాడు. స్వామివారు ఈ విధంగా ఉద్భవించడానికి వెనుక గాథ ఉన్నది.
వైకుంఠ ద్వార పాలకులు, విష్ణుసేవా తత్పరులు అయిన జయ విజయులు ఒకసారి సనకసనందనాది మునులు శ్రీమన్నారాయణుని దర్శనార్థమై వైకుంఠానికి వచ్చారు. వారు లోనికి ప్రవేశించు సమయంలో జయవిజయులు ఇది తగిన సమయం కాదని వారిని అడ్డగించారు. దానికి కోపోద్రిక్తులైన విష్ణు లోకానికి దూరం అవ్వండి అని శపించారు. అప్పుడు వారు శ్రీ మహావిష్ణువును జయవిజయులు శరణు కోరుకోగా దయార్థ్ర హ్రుదయుడైన నారాయణుడు మహర్షుల శాపానికి తిరుగులేదు. కాబట్టి మీరు నా భక్తులు కనుక మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను.
మీరు నా భక్తులుగా ఏడు జన్మలు గానీ, విరోధులుగా మూడు జన్మలు గానీ భూలోకంలో జన్మించిన తరువాత మళ్ళీ వైకుంఠానికి చేరుకుంటారు అని తెలుపగా వారు మీకు దూరంగా ఏడు జన్మలు ఉండలేము, విరోధులుగా మూడు జన్మలు ఎత్తుతామని తెలిపారు. తరువాత జయవిజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకషిపులుగా, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపరయుగంలో శిశిపార దంతవక్త్రులుగా జన్మించారు. కశ్యప ప్రజాపతి భార్య అయిన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అనే మహావీరులు జన్మించారు. హిరణాక్షుడిని సంహరించిన అవతారమే నారసింహ అవతారం. ఈ ఏడాది మే 6న స్వామి జయంత ఉత్సవాలు.
– శ్రీ