ఇతిహాసాలలో, పూర్వకాలంలో సూర్య సంబంధ విశేషాలు మీకు తెలుసా ?

-

సూర్యారాధన, ప్రపంచవ్యాప్తంగా, విభిన్న నామాలతో అనాది కాలం నుంచీ జరుగుతూనే వుందన్నది అక్షర సత్యం. సూర్య ఆత్మా జగత్ స్తస్థు షస్చ …రుగ్వేదం సూర్యుణ్ణె జగదాత్మ అంటున్నది. పూష్ణ, భగ, మిత్ర, అర్యమన్, విస్వత్..రవి, సూర్య, ఇవన్నీ ఆ భాస్కరుని నామాలే. రామాయణ, మహాభారతాల్లో, సూర్య సంబంధమైన వివరణలనేకం ఉన్నాయి. సూర్యొపాసన గురించిన అనేక ప్రమాణాలూ పురాణల్లో చాలా ఉన్నాయి. విస్ణు పురాణం సూర్యుని రథ విస్తారమే, నూరు వేల యోజనాలంటున్నది. దీనికి రెండింతలు దీనీ ఈషా దండము. దీని ఇరుసు (ధుర) ఒకటిన్నర కోటీ, యేడు లక్షల యోజనాల పొడుగు అని పేర్కొన్నది. దీనికే ఈ రథ చక్రమున్నది. ఆ అక్షయ రూపమైన సంవత్సరాత్మక చక్రములో సంపూర్ణ కాలచక్రమున్నది. గాయత్రి, బృహతి, వుష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అన్న యేడూ సూర్య రధాశ్వాలు. మత్స్య, భవిష్య, విష్ణుధర్మోత్తర, అగ్నిపురాణదులలో సూర్య మూర్తికి సంబంధించిన అనేక విశేషాలు లభ్యాలు. భారతీయ శిల్ప కళల్లో, సూర్యుని రూపాలు ప్రాచీన కాలం నుంచే కనిపిస్తున్నాయి.

History Of Lord Surya dev In Ithihasalu

భారతదేశంలో లభ్యమైన ప్రాచీన సూర్య ప్రతిమలలో, కొన్ని రధారూఢునిగా, కొన్ని నిలుచుని ఉన్న భంగిమలోనూ వున్నాయి. రధారూఢుడైన సూర్య ప్రతిమలలో, ఒకే చక్రమున్న రధం పై, ఒకటినుండీ యేడు అశ్వాలు నడుపుతున్న విధానం కనిపిస్తుంది. విచిత్రంగా కొన్ని ఉత్తరభారత ప్రతిమలు, చక్కటి పాదరక్షలూ, పైజామా, పెద్ద చొక్కా, కిరీటంతో కనిపిస్తుండగా, కొన్నింటిలో, భుజలక్రింద, రెండు రెక్కలూ ఉండటం గమనార్హం. ప్రాచీన దక్షిణభారత సూర్యుడు, కమలాలవంటి పాదాలూ, ధోతీ, ఆచ్చాదన లేని విశాలమైన వక్షస్థలంతో దర్శనమిస్తున్నాడు.

క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో శుంగ కాలంలో నిర్మితమై, ఒక స్థంభం పైన, నాలుగు అశ్వాలు పూన్చిన రధంపై ఆరూఢుడైన సూర్యుని విగ్రహం బుద్ధగయలోని పురాతత్వ సంగ్రహాలయంలో వుంది. ఒరిస్సలోని ఖందగిరి లోని అనంత గుహలో లభించిన సూర్య ప్రతిమ కూడా, ఇలాగే నాలుగు గుర్రాలు రధంపైనున్న మూర్తి. కుషాణ కాలం (క్రీ.శక్.2,3 శతాబ్దాలు) నాటి చాలా సూర్య ప్రతిమలు, మథుర ప్రాంతాలలో లభించాయి. ఇవి, ఒక విధమైన యెర్రటి రాయి తో తయారైనవి. నాలుగు గుర్రాలు లాగుతున్న ఒకే చక్రమున్న రధంపై ఆసీనుడైన సూర్య ప్రతిమలూ కొన్ని వీటిలో వున్నాయి. క్రీ . శ. 325 నుండి, ఆరవ శతాబ్దం మధ్య కాలంలో యెన్నో దేవాలయాల నిర్మాణమూ జరిగింది. ఈ కాలం నాటి విశిష్ట ప్రతిమొకటి ఆఫ్ఘనిస్తాన్ లోని ఖైర్ ఖనేహ్ లో దొరికింది. ఈ పాలరాతి ప్రతిమ, అరుణుడు నడుపుతున్న , నాలుగు అశ్వాలు పూన్చిన రధం పైనున్న భాస్కరునిది. వుత్తర గుప్త యుగానికి చెందిన మరో సూర్య మూర్తి కి ఇరువైపులా దండ,పింగళులున్నారు. ఇదీనాడు లండన్ లోని సంగ్రహాలయంలో వుంది. పూర్వ మధ్య యుగంలో కాశ్మీర దేశంలో సూర్యోపాసన చాలా ప్రచారంలో వుండేది. లలితాదిత్యుడనే రాజు చాలా పెద్ద సూర్య దేవాలయాన్ని కట్టించాడు అప్పట్లో, అది ఇప్పుడు శిధిలావస్థలో ఉంది.


మధ్య యుగం నాటి వుత్తర భారత దేశం, సూర్యారాధనకు పెద్ద పీట వేసింది. ప్రతిహార వంశానికి చెందిన చాలామంది శాసకులు, సూర్య భక్తులే! యెన్నో దేవాలయాలను వాళ్ళు కట్టించారు. రాజస్థాన్ లోని ఓషియా అన్న చోట, పదవ శతాబ్దానికి చెందిన ఒక సూర్య దేవాలయం ఉంది, కానీ, అందులో సూర్య ప్రతిమ లేదు. ఇదే కాలంలో, మట్టితో చేసిన యెన్నో సూర్య ప్రతిమలూ దొరికాయి. ప్రతిహార వంశం తరువాత, రాజస్తాన్ లో చౌహాన్ వంశం అధికారం లోకి రాగా, అటు వుత్తర ప్రదేశం లో, గాహడ్ వంశస్తులు, పరిపాలన చేశారు. వీరి కాలం నాటీఇ సూర్య ప్రతిమలు, అజ్మేర్ ఢిల్లీ సంగ్రహాలయాలలో వున్నాయి. గుజరాత్ లో, చాళుక్య వంశ కాలంలో, మోఢేరా అన్న చోట, నిర్మితమైన సూర్య దేవాలయం ఇప్పుడు, శిధిలావస్థలో వుంది. బడౌదా కు సమీపంలొని కాయంద్రా అన్నచోట, సూర్యమందిరం తాలూకు తోరణ ద్వారం, తొమ్మిది-పది శతాబ్దాల నాటిది.

మధ్యప్రదేశ్లో చందోల్ శాసకుల నాటీ సమయంలో, ఖజురహోలో సూర్య మందిర నిర్మాణం జరిగింది. ఇక్కడున్న ఇతర దేవాలయాల పైనా, ఆసీన ముద్రలో సూర్య ప్రతిమలు కాన వస్తాయి. మధ్య ప్రదేశ్ లోనే భేటా ఘాట్ అన్న ప్రదేశం లో గౌరీ శంకర ప్రతిమలతో పాటూ, 11,12 శతాబ్దాలకు చెందిన రధారూఢుడైన సూర్యుని ప్రతిమ వుంది. ఈశాన్య భారతంలో పాల్ శాసకులు బౌద్ధ మతానుయాయులైనా, ఆనాటి సూర్య ప్రతిమలెన్నో పాట్నా, కోల్కత్తా, గవుహతి సంగ్రహాలయాల్లొ భద్రపరుపబడ్డాయి. అదే కాలం నాటి మరికొన్ని సూర్య ప్రతిమలు, లండన్, ఫిలడెల్ఫియా, శాన్ ఫ్రాన్సిస్కో శిల్ప సంగ్రహాలయాలలో వున్నాయి.

బెంగాల్లో పాల్ శాసకుల తరువాత, సేన్ శాసకులు వచ్చారు. ఆనాటి చక్కటి సూర్య ప్రతిమలు ఈనాడు, డిల్లీ సంగ్రహాల యంలో వున్నాయి. ఒరిస్సలో మధ్య యుగంలో గంగ శాసకుల పరిపాలన కూడా, సూర్యోపాసనను ప్రోత్సహించింది. నరసింహ వర్మ అన్న రాజు పదమూడవ సతాబ్దిలో, కుష్టు రోగం నుంచీ విముక్తి కై, సూర్య దేవాలయాన్ని నిర్మించాడంటారు. మన భారత దేశంలో సూర్యునికి గల దేవాలయాలలో ప్రముఖమయినది ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయం. గుజరాత్ నందున్న మోదెరాలో కూడా ఒక సూర్య దేవాలయం ఉంది. ఇక దక్షిణ భారత దేశంలో. పల్లవ రాజుల కాలంలో, మయూరుడు సూర్య శతకాన్నే వ్రాశాడు. (ఈ వివరాలు ముందు ప్రస్తావించటం జరిగింది.) అనేక దేవాలయాల నిర్మాణమూ జరిగింది. చోళ రాజుల కాలంలోనూ, సూర్యుని చాలా పాషాణ, దారు శిల్పాలు దొరికాయి. ఇక కర్ణాటక లో మధ్య యుగం నాటి బేలూరు, హళేబీడు మందిరాలలో, అనేక సూర్య ప్రతిమలు లభ్యాలు. హోయసల రాజుల కాలం నాటి సూర్య ప్రతిమలలో, దక్షిణ భారత శిల్ప కళా వైభవం సుస్పష్టం. మన రాష్ట్రంలో శ్రీకాకుళం లోని అరసవిల్లి సూర్యదేవాలయం కూడా ప్రసిద్ధి చెందినదే! పెద్దాపురం వద్ద ఉన్న పాండవుల మెట్ట మీద ఉన్న సూర్యదేవాలయం ప్రముఖమయినది . పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడ లో కూడా సూర్యదేవాలయం ఉంది.

ప్రంపచంలో సూర్య ఆరాధన విశేషాలు !

కేవలం భారతదేశంలోనే కాదు. గ్రీక్ దేశంలోనూ, మన సూర్యోపాసనను పోలిన భావధార కనిపిస్తుంది. అక్కడి అపోలో, డయానా కథల్లో కూడా, మన వుషాదేవి సూర్యుని చుట్టూ తిరుగుతున్న కథలవలెనే చాలా పోలికలు కనిపిస్తాయి. రెండు దేశాల వివాహ పద్ధతులలోనూ, సూర్య మంత్రాలను వుచ్చరించటం చూస్తే యీ వాస్తవం అవగతమౌతుంది. మెక్సికో దేశంలొనూ, విశ్వ సృజనకు మూలం సూర్యుడనే నమ్ముతారు. చైనా యాత్రికుడు హుయాన్సాంగ్, అరబ్ రచయిత అల్ ఇద్రిసీ, అబూఇషాక్, అల్ ఇస్తర్బీ వంటి వారి రచనల్లోనూ, భారతదేశంలో ఆయా కాలాలలో, వారు చూచిన సూర్య దేవాలయల ప్రస్తావన వుండటం చూస్తే, భారతదేశనికీ, సూర్యోపాసనకూ వున్న అనుబంధం అతి ప్రాచీనమైనదేకాక, అతి పవితమైనదనికూడా అవగతమౌతున్నది.

అందుకే సూర్యునికున్న పేర్లలో ఒకటైన, ‘మిత్రుడు’ అన్న పదం, యుగ యుగాలనుంచీ భూమండలంతో సూర్యునికున్న మైత్రీబంధానికి ప్రతీకగా, అర్థవంతమైనదిగా, సార్థకతతో కూడినదిగానూ కూడా అభివర్ణించవచ్చును.
ఇక ఇటీవల కాలంలో ఉత్తర అమెరికాలో త్రవ్వకాలలో సూర్యప్రతిమ, కెంపు, తదితర సూర్యసంబంధ విగ్రహాలు లభించడం మరో విశేషం.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news