ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ జిల్లాలోని కుండి గ్రామానికి సమీపంలో ఉన్న ఒక అడవిలో వేటకు వెళ్లిన ఒక యువకుడు బుల్లెట్ గాయంతో మరణించగా, మరో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వేటకు వెళ్లిన వారిలో ఒకరు తుపాకీ నుంచి ప్రమాదవశాత్తు కాల్పులు జరపడంతో ఒక వ్యక్తి ఆ కాల్పులకు బలయ్యాడు. మరో ముగ్గురు భయంతో ఆత్మహత్య చేసుకుని మరణించారు. తమ స్నేహితుడు తమ వలన చనిపోయాడు అనే అపరాధ భావన కారణంగా వారు సూసైడ్ చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. వారితో పాటు అడవికి వెళ్లిన వారి ముగ్గురు స్నేహితులు గ్రామస్తులకు ఈ విషయం తెలియజేశారు.
భిలాంగనా బ్లాక్‌లోని ఒక గ్రామం నుంచి శనివారం రాత్రి ఏడుగురు స్నేహితులు వేట కోసం బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. లోడ్ చేసిన తుపాకీతో ముందు వెళుతున్న రాజీవ్ (22) జారిపడి పడిపోతున్న సమయంలో అతని భుజంపై ఉన్న తుపాకీ ట్రిగ్గర్ నొక్కుకోగా అది సంతోష్ కు తగిలింది. సంతోష్ కు రక్తస్రావం కావడంతో వారి స్నేహితులు భయపడ్డారు. రాజీవ్ తుపాకీతో పారిపోగా, శోభన్, పంకజ్ మరియు అర్జున్ అనే ముగ్గురు పురుగుమందులను సేవించారు. ఈ సంఘటన గురించి గ్రామంలోని వారికీ తెలియజేయడానికి రాహుల్ మరియు సుమిత్ గ్రామానికి తిరిగి వచ్చారు. గ్రామస్తులు ముగ్గురు స్నేహితులను బలేశ్వర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తీసుకెళ్లారు, అక్కడ పంకజ్ మరియు అర్జున్ చనిపోయినట్లు ప్రకటించగా, చికిత్స సమయంలో శోభన్ మరణించాడు.