కాలి మడమల్లో నొప్పి గురించి చాలా మంది చెబుతుంటారు. పొద్దున్న లేవగానే మంచం మీద నుండి కిందకి అడుగుపెట్టినపుడు ఈ నొప్పి మరీ తీవ్రంగా ఉంటుంది. మడమల్లో నొప్పికి చాలా కారణాలున్నాయి. పాదాలు పగలడం, ఆర్థరైటిస్ వంటివి కూడా ఇలాంటి నొప్పులకు కారణం కావచ్చు. కాలి మడమల నొప్పులతో బాధపడుతుంటే ఇక్కడ కొన్ని ఇంటి నివారణలు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఇవి ప్రయత్నించండి.
ఒక గ్లాసు పాలు తీసుకుని అందులో కొద్దిగా పసుపు కలపండి. ఆ తర్వాత దానిలో తేనె కలిపి రోజూ పొద్దున్న లేవగానే తాగాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుండడం వల్ల మడమల్లో నొప్పి తగ్గుతుంది.
మడమల్లో నొప్పికి మంచుముక్క మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఒక మంచుముక్కని తీసుకుని ఒక వస్త్రంలో చుట్టి నొప్పిగా ఉన్న మడమలపై పెట్టాలి. మసాజ్ చేసినట్టుగా అటూ ఇటూ తిప్పాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తుంటే మడమల్లో నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
అవిసె నూనె
మడమల నొప్పిని మటుమాయం చేయడంలో అవిసెనూనె బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా అవిసె నూనె వేసి పాదాలను అందులో ఉంచాలి. ఇలా రోజూ చేస్తుండాలి. ఇంకా అవిసె నూనెని డైరెక్టుగా మడమలకి రాయవచ్చు. దానివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఆవ నూనె
ఉదయం స్నానం చేసేముందు పాదాలను శుభ్రంగా తుడవాలి. స్నానం చేసిన తర్వాత ఆవనూనెని పాదాలకి వర్తించాలి. ఈ విధంగా రోజూ చేస్తూ ఉంటే మడమల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
మడమల నొప్పి మరీ తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.