ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ జనాలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే భారత్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 60కి పైగా చేరుకోగా… కేరళ, కర్ణాటక, జమ్మూకాశ్మీర్‌లలో స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు, యూనివర్సిటీలను మూసివేయించారు. ఎన్నో ఐటీ, కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇస్తున్నాయి. అయితే కరోనా వైరస్ నిజానికి మానవ శరీరంపై ఏ విధంగా దాడి చేస్తుంది..? ఆరంభం నుంచి పరిస్థితి తీవ్రతరం అయ్యే వరకు దాని లక్షణాలు ఎలా ఉంటాయి..? అన్న వివరాలను పలువురు సైంటిస్టులు తాజాగా వెల్లడించారు. అవేమిటంటే…
* కరోనా వైరస్ మనిషికి సోకినప్పుడు ఆరంభంలో జ్వరం, పొడి దగ్గు, అలసట కనిపిస్తాయి.
* వ్యాధి తీవ్రత పెరిగేకొద్దీ ఇన్‌ఫెక్షన్ శరీరమంతటా వ్యాప్తి చెందుతుంది. వైరస్ ఎగువ శ్వాస కోశానికి, ముక్కుకు, గొంతుకు వ్యాపించినప్పుడు జలుబు, దగ్గు వస్తాయి. దగ్గు తీవ్రతరమవుతుంది. ఈ దశ నుంచి వ్యాధి తీవ్రత ఎక్కువవుతుంది.
* కరోనా వైరస్ శ్వాసకోశంలోకి ప్రవేశించినప్పుడు సమస్యలు తీవ్రంగా ఉంటాయి.
* కరోనా వైరస్ కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఏర్పడుతుంది. దీంతో ఊపిరితిత్తులు దెబ్బ తింటాయి. ఈ స్థితిలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. దీంతో రోగులు వేగంగా ఊపిరితీసుకుంటారు. ఈ స్థితిలో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి.
* రక్తంలో ఆక్సిజన్ లేకపోతే మెదడు, గుండె, ఇతర శరీర అవయవాలు బలహీనమవుతాయి. ఇక తీవ్రమైన కేసుల్లోనే ఊపిరితిత్తులు బాగా దెబ్బ తింటాయి. దీంతో రోగి శ్వాస తీసుకోలేక చాలా త్వరగా అలసిపోతాడు. ఈ స్థితిలో ఆక్సిజన్ తక్కువైతే త్వరగా స్పృహ తప్పిపోతారు. ఈ దశకు చేరుకుంటే రోగికి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సార్లు మరణించేందుకు కూడా అవకాశం ఉంటుంది. కనుక పరిస్థితి ఈ దశకు రాకముందే.. అంటే ఆరంభంలోనే లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. దీంతో ప్రాణాపాయ స్థితి రాకుండా చూసుకోవచ్చు..!