రజనీ కాంత్ రాజకీయ ప్రవేశం ఎప్పుడు…? సొంత పార్టీ పెడతారా…? ఏదైనా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా…? డిఎంకె లో చేరతారా…? అన్నాడిఎంకె లో జయలలితతో విభేదాలు ఉన్నాయి కాబట్టి చేరే అవకాశం లేదు. మరి జాతీయ పార్టీల్లో చేరతారా…? అదే జరిగితే తమిళనాట రజని రాజకీయ ప్రస్తానం దాదాపుగా ఆగిపోయినట్టే. జాతీయ పార్టీలను తమిళనాడు ప్రజలు ఎప్పుడూ ఆహ్వానించలేదు.
ఉంటే డిఎంకె లేదా అన్నా డిఎంకె. కేంద్రంలో ఎంత బలమైన ప్రభుత్వం ఉన్నా సరే తమిళనాట మాత్రం ఈ రెండు పార్టీల హవానే ఎక్కువగా ఉంటుంది. ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే తమిళనాట జాతీయ పార్టీలకు సాధ్యం కాదు. కాబట్టి రజని వేచి చూసి ఆ స్టెప్ వేస్తారా…? ఎప్పుడో 90ల చివర్లో ఆయన రాజకీయాల్లోకి వస్తారు అనే ప్రచారం జరిగింది. ఆయన పార్టీ పెట్టే అవకాశం ఉందని తమిళ మీడియా కూడా ఎన్నో కథనాలు రాసింది.
జాతీయ మీడియా, మన తెలుగు మీడియా కూడా దీని మీద ఆసక్తి చూపించింది. కాని రజని కాంత్ మాత్రం రాజకీయాల మీద దృష్టి పెట్టలేదు. ఇదే సమయంలో ఆయన జయలలిత కు భయపడే ఆయన రాజకీయాల్లోకి రాలేదు అన్నారు. జయలలిత ఉన్నప్పుడు ఆమెకు ఎదురు తిరిగిన వాళ్ళు అందరూ సైలెంట్ అయ్యారు. ఆమెకు ఎదురు తిరిగి మాట్లాడినందుకు కమల్ హాసన్ ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికి తెలిసిందే.
మరి ఆ సాహసం రజని కాంత్ చేస్తారా…? విజయ్ అనే నటుడు పార్టీ పెట్టాలని చూడగా రెండేళ్ళ పాటు సినిమా విడుదల కాలేదు. కమల్ హాసన్ కూడా విశ్వరూప౦ 2 సమయంలో ఇలాగే ఇబ్బందులు పడ్డారు. జయ మరణం తర్వాత కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె మరణం తర్వాతే రజని కాంత్ రాజకీయ ప్రకటన చేసారు. అప్పటి వరకు ఎక్కడా కూడా ఆయన మీడియాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
ఇప్పుడు జయలలిత లేదు కాబట్టి తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదనుకునే ఆయన రాజకీయాల్లోకి రావలనుకుని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇప్పుడు రజని కాంత్ ఏ పార్టీలో చేరకుండా సొంత పార్టీ పెడుతున్నట్టు, యువకులకు అవకాశం ఇస్తున్నట్టు, యువకులకు రాజకీయాల్లో ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ… 70 ఏళ్ళ వయసులో నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్ళకు రజనీని దేవుడు ఆదేశించాడు.
ఆయన పార్టీ పెట్టాడు. ఇప్పుడు తమిళనాడులో రజని కాంత్ ఎంత వరకు రాజకీయాల్లో నిలబడే అవకాశం ఉందో చెప్పలేని పరిస్థితి. డిఎంకె చాలా బలంగా ఉంది అధికారంలో లేకపోయినా. ఒక్కసారి తమిళనాడు లో అధికారం కోల్పోతే అన్నాడిఎంకే ని ముందుకి నడిపించే నాయకుడు లేరు. కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నారు. అన్నాడిఎంకే అనేది క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న పార్టీ.
పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రజల ఆదరణ పొందే ప్రయత్నం చేస్తున్నారు. ముందు డిఎంకె ని ఎదుర్కొని నిలబడాలి రజని కాంత్. ఇదే సమయంలో రజని ముందు ఉన్న సవాల్… కర్ణాటక వ్యక్తిని కాదు మీ వాడిని అని నిరూపించుకోవాలి. అలా నిరూపించుకునే జయ రాజకీయాల్లో నిలబడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య మైసూర్ పాక్ గురించి గొడవ అయింది. అలాంటి సున్నిత రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు.
కాబట్టి కర్ణాటక వ్యక్తి రజని కాంత్ అనే ప్రచారం డిఎంకె తీసుకువెళ్తే, దాని నుంచి బయటపడి రాజకీయం చెయ్యాలి రజని కాంత్. అదే విధంగా కమల్ తో ఆయన స్నేహం చేసినా అది ఎంత వరకు నిలబడుతుందో చెప్పలేని పరిస్థితి. రజని కాంత్ కి కమల్ కి మధ్య కాస్త సిద్దాంత పరంగా విభేదాలు ఉన్నాయి. రజని నాస్తికుడు కాదు, కమల్ కి ఆ లక్షణాలు ఎక్కువ. కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసి పని చేసే విషయమై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి.
తనతో కలిసి నడవాలని రజనీని కమల్ కోరారు. రజని కూడా ఈ విషయంలో ఏ స్పష్టత ఇవ్వలేదు. కాని డిఎంకె ని ఎదుర్కోవాలి అంటే వీరు కలవాలి. వీరు కలిస్తే తమిళనాట ముక్కోణ పోటీ వస్తుంది. వీరు కలవకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, అంతిమంగా అన్నా డిఎంకె లాభపడే అవకాశాలు ఉంటాయి. భారతీయుడు 2 సినిమా ప్రమాదం విషయంలో కమల్ ని బిజెపి దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది.
అన్నాడిఎంకే బిజెపి పొత్తులో ఉన్నాయి. కాబట్టి రజనీని కమల్ ని కలవనీయకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి రజని ఏ విధంగా ముందుకి వెళ్తారో చూడాలి. సిఏఏ విషయంలో రజని బిజెపికి మద్దతు ఇచ్చారు. కమల్ వ్యతిరేకించారు కూడా… డిఎంకె కూడా వద్దని అంటుంది. మరి ఈ పరిస్థితులను తట్టుకుని ఏ విధంగా నిలబడతారో ఏ విధంగా సున్నిత రాష్ట్రమైన తమిళనాట రాజకీయాలు చేస్తారో చూడాలి.