కొందరు ఒకే బ్రౌజర్లో కనీసం ఒక 20 ట్యాబ్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. అందులో ఒకదాంట్లో మూవీ చూస్తారు, ఇంకో దాంట్లో బ్యాంకు లావాదేవీలు, ఆన్లైన్ షాపింగ్, ఈ-కామర్స్ వెబ్‌సైట్స్, ఫుడ్ డెలివరీ యాప్స్ ఇలా ఒకటేమిటీ రకరకాల పనులు చేస్తుంటారు. పనయ్యాక అన్నీ క్లోజ్ చేసి క్లీన్ చేస్తారా అంటే అదీ లేదు. బ్రౌజర్లో మనం చూసిన వెబ్‌సైట్లు, వాడిన పాస్ట్‌వర్డ్‌లు, డౌన్‌లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ పేరుకుపోయి ఉంటారు. దీనివల్ల పీసీ మీద లోడ్ పడటమే కాదు మీ పర్సనల్ వివరాలు ఇతరులకు చిక్కే అవకాశమూ ఉంది.
అందుకే మీరు బ్రౌజర్స్‌ని వాడిన తర్వాత అందులో డేటాను డిలీట్ చేయాలి, క్యాచీ, కుకీస్, హిస్టరీని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. దీనివల్ల మీ కంప్యూటర్లో స్పేస్ క్రియేట్ అవ్వడమే కాదు.. మీ పర్సనల్ వివరాలు ఎవరి చేతికీ చిక్కవు. అంతే కాకుండా ఇలా తరచూ క్లీన్ చేయడం వల్ల మీ పీసీ స్పీడ్‌గా పనిచేస్తూ ఉంటుంది.
ఇంతకీ క్యాచీ, కుకీస్ అంటే ఏంటనుకుంటున్నారా.. అదేనండి మీరు ఏదైనా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసినప్పుడు కుకీస్‌ను అంగీకరించమని అడిగే పాపప్స్‌ను గమనించే ఉంటారు. వెనకా ముందు ఆలోచించకుండా చాలామంది వీటిని యాక్సెప్ట్ చేసి తర్వాత పనుల్లో మునిగిపోతుంటారు. ఇంతకీ కుకీలంటే? మనం చూసే వెబ్‌సైట్లు సృష్టించుకునే ఫైళ్లు. వెబ్‌సైట్‌ను చూస్తున్నప్పుడు, తిరిగి వాటిని తెరచినప్పుడు తేలికగా పనులు చేసుకోవటానికి వీలుగా ఇవి సమాచారాన్ని దాచి పెట్టుకుంటాయి. బ్రౌజర్ క్యాచీ ఏమో వెబ్‌సైట్ పేజీల్లో కొన్ని భాగాలను (ఫొటోల వంటి వాటిని) గుర్తుపెట్టుకుంటుంది. తిరిగి ఎప్పుడైనా ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లినప్పుడు అది త్వరగా లోడ్ కావటానికిది తోడ్పడుతుంది. గతంలో మనం చూసిన వెబ్‌సైట్ల జాబితాను హిస్టరీ నిక్షిప్తం చేసుకుంటుంది.
మన బ్రౌజింగ్ వివరాలు గోప్యంగా ఉంచుకోవాలని అనుకుంటే కుకీలు, క్యాచీ, హిస్టరీని క్లియర్ చేసుకోవటం మంచిది. మరి వీటిని ఎలా క్లియర్ చేయాలంటే.
- మీరు గూగుల్ క్రోమ్‌లో బ్రౌజ్ చేసినట్లయితే.. పీసీలో క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి. పైన కుడివైపున కనిపించే మూడు చుక్కల బటన్‌ను నొక్కాలి.
- డ్రాప్ డౌన్ మెనూలో ‘మోర్ టూల్స్’ ద్వారా ‘క్లియర్ బ్రౌజింగ్ డేటా’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- బ్రౌజింగ్ హిస్టరీ, డౌన్‌లోడ్ హిస్టరీ, కుకీస్, ఇతర సైట్ డేటాలకు సంబంధించిన అన్ని బాక్సులను ఎంచుకోవాలి. కావాలంటే బేసిక్ సెటింగ్స్‌లోకి వెళ్లి రీచెక్ చేసుకోవచ్చు.
- టైమ్ రేంజ్ ఆప్షన్ ద్వారా ఎప్పట్నుంచి ఎప్పటివరకు బ్రౌజింగ్ వివరాలను డిలీట్ చేయాలో ఎంచుకోవచ్చు.
- అయితే క్యాచీని క్లియర్ చేసుకోవటంలో ఆల్‌టైమ్‌ను ఎంచుకోవటం మంచిది.
- చివరికి ‘క్లియర్ డేటా’ బటన్ మీద క్లిక్ చేయాలి. అంతే. మొత్తం వివరాలు తొలగిపోతాయి.
ఒక వేళ మీరు మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో బ్రౌజ్ చేస్తే అందులో క్యాచీ, కుకీస్ ఎలా క్లియర్ చేయాలంటే..?
- ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత పైన కుడివైపు మూలకు కనిపించే హ్యాంబర్గర్ మెనూను క్లిక్ చేయాలి. సెటింగ్స్ ఆప్షన్ మీద నొక్కాలి.
- ఎడమ వైపున జనరల్ సెటింగ్స్ కింద ఉండే ‘ప్రైవసీ అండ్ సెక్యూరిటీ’ విభాగాన్ని ఎంచుకోవాలి.
ఇందులో ‘కుకీస్ అండ్ సైట్ డేటా’ లోకి వెళ్లి, ‘డిలీట్ కుకీస్ అండ్ సైట్ డేటా వెన్ ఫైర్‌ఫాక్స్ క్లోజ్డ్’ బాక్స్‌ను ఎంచుకొని ‘క్లియర్ డేటా’ బటన్‌ను నొక్కాలి. - ప్రైవసీ విభాగంలో అలాగే కిందికి వెళ్తే హిస్టరీ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ‘క్లియర్ హిస్టరీ వెన్ ఫైర్‌ఫాక్స్ క్లోజెస్’ బాక్ల్‌ను ఎంచుకొని ‘క్లియర్ హిస్టరీ’ బటన్‌ను నొక్కాలి.
ఒకసారి క్యాచీ, కుకీస్, హిస్టరీని తొలగించుకున్నాక ఆయా వెబ్‌సైట్లలోకి తిరిగి లాగిన్ కావాలి. ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా మీ పీసీ వేగంగా పనిచేయాలన్నా.. తరచూ హ్యాంగ్ కాకూడదన్నా.. ఎక్కువ కాలం స్పీడ్‌గా వర్క్ అవ్వాలన్నా మీరు రోజూ ఈ పని చేయాల్సిందే..!