ధనం మూలం మిదమ్ జగత్. లక్ష్మీలేనిదే ప్రపంచంలో ఏ పనికాదు అనేది జగమెరిగిన సత్యం. అయితే ధనానికి అధిదేవత లక్ష్మీదేవి. అంతేకాదు లక్ష్మీ అంటే కేవలం ధనమే కాదు విద్యా లక్ష్మీ, సంతాన లక్ష్మీ, ఆరోగ్యం, ధాన్యం, పశు, అటవీ సంపదలు, ప్రశాంతత, విజయం ఇలా రకరకాలైన లక్ష్మీరూపాలు అందరీకి అవసరం. అయితే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం…
ప్రతీరోజు ఉదయం నిద్రలేవగానే ఎవరినీ చూడకుండా తమ అరచేతులను కళ్ళకు దగ్గరగా తెచ్చుకుని చూసి, ముఖం మీద రెండు అరచేతులను త్రిప్పుకోవాలి.ఇక భోజనానికి ముందు ఎంగిలి చేయకుండా మొదటి ముద్దను ఆవుకు తినిపించండి. వీలుకాదు అనుకుంటే అన్నం వండగానే ఒకముద్ద తీసి పెట్టుకుని ఆవుకు పెట్టండి. చెడిపోయిన అంటే పాసిపోయిన అన్నం మాత్రం ఆవులకు పెట్టకూడదు.
శనివారం రోజున గోధుమలను పిండి చేసే కార్యక్రమ నియమాన్ని పెట్టుకోవాలి. ఆ పిండిలో పదవభాగం చిన్న సైజు నల్ల శెనగలు కలపాలి. ఇంట్లో చీమలకు వాటికి చెక్కర కలిపిన పిండిని వేసి తినిపించాలి.ప్రతీ శుక్రవారం సూర్యోదయానికి పూర్వమే ఇళ్ళు శుభ్రం చేసుకోవాలి. ఇళ్ళు శుబ్రం చేసుకోకుండా ఉదయ అల్పాహారం తినకూడదు. సంధ్యాసమయంలో ఇళ్ళు ఊడ్చకూడదు.
సంధ్యాసమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి లేదా కాళ్ళు, ముఖం కడుక్కుని అయినా ఇంట్లోని దేవీదేవతలకు ధూపదీప హారతులు ఇవ్వాలి.
ఎటువంటి పనికి బయటకు వెళ్ళవలసి వచ్చినా ఇంటిని శుభ్రపరచుకుని బయటకు వెళ్ళాలి. పరగడుపున ఎటువంటి కార్యార్థం కోసం అయినా బయటకు వెళ్ళవలసి వస్తే ఒక స్పూను తీయిని పెరుగుని నోట్లో వేసుకుని వెళ్ళాలి. గురువారం రోజున ముత్తైదువును ఇంటికి పిలిచి శుభకరమైనది ఎదో ఒకటి దానం చేయండి, దీన్ని తప్పక ప్రతి గురువారం అనుసరించండి. ధన సంబంధమైన కార్యాలకు అన్నింటికీ సోమవారం లేదా బుధవారం ప్రాధాన్యత ఇవ్వండి. తెల్లని వస్తువులు గురువారం దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
– శ్రీ