హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని ఏ చట్టంలో ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముస్లింలను బీసీల్లో ఎలా కలుపుతారని నిలదీశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. దీనిపై రాహుల్గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసలు కులగణన జరిపిన విధానమే సరిగా లేదని, 50 శాతం ఇళ్లకు సర్వే సిబ్బంది వెళ్లనేలేదని ఆరోపించారు. తెలంగాణలో కులగణన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్య వల్ల బీసీల సంఖ్య తగ్గిందన్నారు. ఇది చాలా విచారకరం అని చెప్పారు. తూతూమంత్రంగా సర్వే చేశారని విమర్శించారు. ఈ సర్వేపై అనేక బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో రాహుల్గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్స ర్కార్.. ముస్లిం బీసీ, హిందూ బీసీలు అని కొత్త పాలసీ తెచ్చిందని కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి విధానం దేశంలో మరెక్కడా లేదని స్పష్టంచేశారు. ప్రజలను కులం, మతం పేరుతో విభజించడం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్గాంధీ కి అలవాటేనని దుయ్యబట్టారు. తమకు న్యాయం కావాలని ఓ వైపు బీసీలు కొట్లాడుతుంటే ముస్లింలను తీసుకొచ్చి బీసీల్లో కలపడం ద్వారా వారికి కాంగ్రెస్ పార్టీ మరింత అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.