నాలాలో పాప డెత్ పై హేచ్చార్సీ సీరియస్.. కేసు విచారణ !

నేరేడ్మెట్ సంతోషిమాత నగర్ కాలనీలో 12 సంవత్సరాల సుమేధ అనే బాలిక నాలాలో కొట్టుకుపోయి బండ చెరువులో శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులకు పోస్టుమార్టం రిపోర్ట్ అందింది. సైకిల్ తొక్కుతూ సుమేధ నాలలో పడిపోయినట్టు గుర్తించారు. కింద పడిపోగానే తలకు బలమైన గాయం అయిందని, తలకు బలమైన గాయం కావడంతో పాప అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని తేలింది. నాలాలో పడి పోవడంతో నీళ్లు తాగిందని, దీంతో శరీరంలో మొత్తం నీరు చేరి ఉబ్బిపోయిందని గుర్తించారు. ఊపిరితిత్తులలోకి నీరు చేరడంతో శ్వాస ఆడక సుమేధ చనిపోయిందని ప్రాధమిక అంచనాకు వచ్చారు. తన కూతురు చనిపోవడానికి పరోక్షంగా కారణం జి.హెచ్.ఎం.సి నిర్లక్ష్యమే కాబట్టి జి.హెచ్.ఎం.సి అధికారులపై నేరెడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు.

అయితే ఈ నాలా డెత్ పై హేచ్చార్సీ సీరియస్ అయింది. ఈ కేసును సుమోటోగా విచారణకు తీసుకుంది హేచ్చార్సీ. జీహెచ్ఎంసీ, మునిసిపల్ శాఖలకి నోటీసులు జారీ చేశారు. ఇక సుమేధ కనిపించడం లేదంటూ పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు పై మిస్సింగ్ కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఇవాళ అంత్య క్రియలు పూర్తయిన తరువాత పేరెంట్స్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశామని, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మా అమ్మాయి చనిపోయిందంటూ స్టేట్ మెంట్ ఇచ్చారని లిఖిత పూర్వకంగా ఇవ్వకపోయినా స్టేట్‌మెంట్ లో చెప్పారు కాబట్టి కేసులో మరి కొన్ని సెక్షన్స్ యాడ్ చేస్తున్నామని పేర్కొన్నారు.