కట్టుకున్న భార్యను కాపాడబోయి ఒక భారత సంతతి వ్యక్తి అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనీల్ నినాస్ అనే 32 ఏళ్ళ వ్యక్తి దుబాయ్ లోని ఉమ్ అల్ క్వెయిన్ లోని వారి అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. వివరాల్లోకి వెళితే సోమవారం రాత్రి ఉమ్ అల్ క్వాయిన్లోని వారి అపార్ట్మెంట్ యొక్క కారిడార్లో ఉంచిన ఎలక్ట్రిక్ బాక్స్ నుండి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించడంతో అతని భార్య మంటల్లో చిక్కుకుంది.
దీనితో ఆమెను కాపాడటానికి గాను అనీల్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో మంటలు అతనికి కూడా అంటుకోవడం తో అక్కడ ఉన్న స్థానికులు అతన్ని కాపాడటానికి గాను తీవ్రంగా ప్రయత్నించారు. పడక గదిలో ఉన్న అనీల్ వేగంగా ఆమె వద్దకు వెళ్ళగా ఆమె ప్రాణాలతో బయటపడింది గాని అనీల్ కి మాత్రం 90 శాతం వరకు గాయాలు అయ్యాయి. ఈ జంటను సోమవారం రాత్రి,
ఉమ్ అల్ క్వాయిన్ లోని షేక్ ఖలీఫా జనరల్ ఆసుపత్రికి తరలించారు, మెరుగైన చికిత్స కోసం మంగళవారం అబుదాబిలోని మాఫ్రాక్ ఆసుపత్రికి తరలించారు. “మాకు ఖచ్చితమైన వివరాలు తెలియవు. కాని కారిడార్లో ఉన్నప్పుడు మొదట మంటలు చెలరేగాయి. పడకగదిలో ఉన్న అనిల్ తన భార్య వద్దకు పరిగెత్తి, మంటలు తనకు వ్యాపించినప్పుడు ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు” అని అక్కడి స్థానికుడు ఒకరు చెప్పారు.
“అతని పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని వైద్యులు చెప్పారు. మేమంతా ఆయన కోసం ప్రార్థిస్తున్నాము” అని ఆసుపత్రిలో ఉన్న అనిల్ నినాన్ బంధువు ఒకరు మీడియాకు వివరించారు. అతని భార్య నీను పరిస్థితి మెరుగుపడిందని ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. ఆమెకు కేవలం 10 శాతం గాయాలు మాత్రమే అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఈ కేరళ దంపతులకు 4 సంవత్సరాల కుమారుడు ఉన్నారు.