మీరు తినే కూరగాయలను మీరే పండించుకోండి.. ప్లేస్ లేకున్నా సరే.. ఈ టెక్నిక్ తో..!

అబ్బబ్బ.. ఈరోజులో ఏం తినేటట్టు లేదబ్బా. కూరగాయలు చూస్తేనేమో పెస్టిసైడ్స్ వేసి పండించినవి. అన్నీ హైబ్రిడే. ఎప్పుడో కోసిన కూరగాయలు అమ్ముతుంటారు. అవి టేస్టు ఉండవు పాడు ఉండవు. ఈ మందుల కూరగాయలను తినలేక చచ్చిపోతున్నామబ్బా. మనమే పండించుకుందామంటేనేమో ప్లేస్ లేకపాయె. ప్లేస్ ఉంటే మన కూరగాయలు మనమే పండించుకొని హ్యాపీగా తినేయొచ్చు. అసలే ఇది సిటీ.. పల్లెటూరు కూడా కాదు. ఇక్కడ ఉండటానికి ఇల్లే దొరకదు. పండించుకోవడానికి ప్లేస్ కూడా ఉంటుందా? ఏం బతుకులురా ఇవి. అంతా హైబ్రిడ్ బతుకులు.. అంటూ చిరాకు పడుతున్నారా?

అస్సలు పడకండి. మీకోసం చక్కటి ప్లాన్ ఉంది. మీరు తినే కూరగాయాలను మీరే పండించుకోవచ్చు. మీ ఇంటి ముందు, ఇంటి వెనుక ప్లేస్ లేకున్నా సరే. సహజసిద్ధంగా పండించుకొని వండుకొని తినొచ్చు. దానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. రోజుకు ఒక అర్ధగంట సమయం కేటాయిస్తే చాలు. నమ్మబుద్ధి కావడం లేదే అంటారా? అయితే ఓసారి హైదరాబాద్ వెళ్లొద్దాం పదండి..

హైదరాబాద్ కూడా మహానగరమే. మెట్రో సిటీ. ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో నగరాలతో పోటీ పడుతోంది. హైదరాబాద్ లో కూడా ప్లేస్ కష్టాలు మొదలయ్యాయి. సిటీల్లో ఉంటూ తమ కూరగాయలను తామే పండించుకొని తినాలనుకునే వాళ్లకు పరిష్కారం చూపించింది హైదరాబాద్ కు చెందిన అర్బన్ కిసాన్ అనే సంస్థ. హైడ్రోపానిక్స్ అనే టెక్నిక్ ద్వారా అత్యంత సులువుగా వాళ్లు పంటలను పండిస్తారు. అవును.. మీరు చేయాల్సిందల్లా ఆ సంస్థకు కాల్ చేయడం అంతే. వాళ్లే మీ ఇంటికి వచ్చి అన్నీ సెట్ చేసి వెళ్తారు.

అర్బన్ కిసాన్ రూపకర్త హైదరాబాద్ కు చెందిన 25 ఏళ్ల విహారి కనుకొల్లు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ఉపయోగించి ఎలా పంట పండించుకోవచ్చో పరిశోధన చేసి ఈ హైడ్రోపోనిక్ ఫార్మింగ్ ద్వారా విజయవంతంగా ఎక్కువ దిగుబడి తీసుకొస్తున్నారు. అది కూడా ఎటువంటి ప్లేస్ లేకున్నా.

నిజానికి హైడ్రోపానిక్ టెక్నిక్ ద్వారా యూరప్, అమెరికాలో పంటలు పండిస్తారు. సాధారణంగా పంటలు పండించేవాళ్లకు కాస్త బరువు తగ్గించి సిటీల్లో నివసించే వాళ్లు తాము తినే కూరగాయలను తామే పండించుకోవడం కోసం రూపొందిందే ఇది.

ఈ టెక్నిక్ ద్వారా ఏ వాతావరణ పరిస్థితుల్లో అయినా.. 95 శాతం నీరు లేకున్నా… ఎటువంటి నేల అవసరం లేకుండా పంటలు పండించవచ్చు. విహారి.. ఫైనాన్స్ లో తన కెరీర్ ను కొనసాగించాలనుకున్నాడు. కానీ.. భారతదేశంలో డిమాండ్, సప్లయి మధ్య ఉన్న తేడాను గుర్తించి దాని కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఆసమయంలోనే తనకు డాక్టర్ సాయిరాం అనే సైంటిస్ట్ పరిచయమయ్యాడు. సాయిరాం తన ఇంటి వెనుక సొంతంగా వ్యవసాయం చేయడం విహారి చూశాడు. హైడ్రోపానిక్ ద్వారా సాయిరాం తన ఇంటి వెనుక విజయవంతంగా కూరగాయలు, ఇతర పంటలు పండించడం చూసి.. ఇద్దరు కలిసి హైడ్రోపానిక్ టెక్నిక్ కు సంబంధించిన కంపెనీ పెట్టాలని భావించారు. అలా రూపొందిందే అర్బన్ కిసాన్.

అర్బన్ కిసాన్ ఏం చేస్తుంది?

ఎవరికైనా సొంతంగా కూరగాయలు పండించుకోవాలనుకున్నా… ఇతర పంటలు పండించుకోవాలనుకున్నా… అర్బన్ కిసాన్ వాళ్లకు తోడుంటుంది. వ్యవసాయంలో ఓనమాలు తెలియకున్నా.. వాళ్లకు కాంటాక్ట్ అయితే చాలు.. సంవత్సరాంతం కూరగాయలు, ఆకుకూరలు, మూలికలు పండించుకోవచ్చు. ఎక్కడైనా వీటిని పండించుకోవచ్చు. ప్రత్యేకంగా స్థలం ఉండాల్సిన అవసరమే లేదు. ఇంటి పైన కానీ.. బాల్కనీలో కానీ.. ఇంట్లో కానీ.. ఎక్కడైనా పండించుకోవచ్చు.

దానికి కావాల్సిన మొక్కలు, గింజలు, వాటికి వేయాల్సిన ఎరువు అన్నీ కంపెనీయే చూసుకుంటుంది. ఒక మోడల్ కిట్ లో 18 నుంచి 36 మొక్కలు ఉంటాయి. ఒకసారి కంపెనీకి కాంటాక్ట్ అయితే వాళ్లే ఎలా చేయాలి.. ఏం చేయాలి.. అని సలహా ఇస్తారు. వాళ్లే ఇంటికి వచ్చి ఇంటిని చూసి వ్యవసాయ క్షేత్రాన్ని సెట్ చేస్తారు. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే. మీ బిజీ షెడ్యూల్ లో రోజు ఒక అర్ధగంట ఆ మొక్కలను నీళ్లు పెట్టేందుకు కేటాయిస్తే చాలు.

వీళ్లు మట్టి బదులుగా కోకోనట్ వేస్ట్ ను ఎరువుగా, మట్టిగా ఉపయోగిస్తారు. దాంట్లోనే గింజలను నాటుతారు. అదే మట్టిలా ఉపయోగపడుతుంది. మట్టిలో ఉండే ఇతర పోషకాలు ఏవైతే మొక్క ఎదుగుదలకు కావాలో.. వాటన్నింటినీ కోకోనట్ వేస్ట్ లో కలుపుతారు. అంతే.. మట్టి అవసరమే లేకుండా మొక్కలను పెంచుకోవచ్చు. ఇది ఒకసారి పెట్టుబడి పెట్టేదే. ఒకసారి పెట్టుబడి పెడితే జీవితకాలం మీకు ఫలితం వస్తుంది.

ఇప్పటి వరకు ఈ కంపెనీ ఐదు రాష్ట్రాల్లో 8000 మొక్కలను అమ్మింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఈ కంపెనీ వెర్టికల్ ఫామ్ ను అభివృద్ధి చేస్తోంది. అది నెలకు 50 వేల రకాల పంటలను దిగుబడి చేస్తోంది. 2000 స్క్వైర్ ఫీట్లలో ఆ ఫామ్ విస్తరించి ఉంది. కస్టమర్లు అక్కడికి వెళ్లి పండిన కూరగాయను, ఫ్రెష్ కూరగాయలను అక్కడే కొనుక్కొని వెళ్లే సదుపాయం అది. అవి కెమికల్ వేసి పండించినవి కాదు.. ఇంకేమీ కావు. సహజసిద్ధంగా పండించినవి కావడం.. కస్టమర్లకు ఆర్డర్ ప్రకారం అప్పటికప్పుడు చెట్ల నుంచి తెంపి ఇస్తారు. దీంతో ఆరోగ్యానికి ఆరోగ్యం. టేస్ట్ కు టేస్టు. ఈ టెక్నిక్ ప్లేస్ సమస్యలు ఎక్కువగా ఉన్న ముంబై లాంటి సిటీల్లో బాగా ఉపయోగపడుతుందంటూ అర్బన్ కిసాన్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.