హైదరాబాద్ లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. వెలుగులోకి సంచలన అంశాలు !

నార్సింగి పరిధిలోని హైదర్‌షాకోట్‌ లక్ష్మీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రేమించాలంటూ రెండేళ్ళుగా యువతి వెంట షారూఖ్ సల్మాన్ అనే వ్యక్తి పడుతున్నట్టు చెబుతున్నారు. ఛాలెంజ్ హబీబ్ సెలూన్ లో పని చేస్తున్న షారుఖ్ కి తరుచూ యువతి సెలూన్ కు వెళ్తుండటంతో ఇద్దరి మధ్య పరిచయం మొదలైంది. దీంతో యువతిని ప్రేమించాలంటూ షారుఖ్ వేధిస్తూ వచ్చినట్లు చెబుతున్నారు. గతంలో తండ్రితో కలిసి షారుఖ్ పై షీ టీమ్స్ కు యువతి ఫిర్యాదు చేసినా ఇంకా షారుఖ్ వెంటపడుతూ వేధిస్తున్నట్లు చెబుతున్నారు. 

దీంతో మేలో యువతికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావించారు, విషయం తెలిసి యువతిని అంతమొందించేందుకు ప్లాన్ వేసిన షారుఖ్ తనకు దక్కని యువతి మరెవరికి దక్కకూడదని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. అందుకే నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో యువతి నివసిస్తున్న అపార్ట్మెంట్ వద్దకు వచ్చిన షారుఖ్, మాట్లాడాలంటూ యువతిని పిలిచాడు. బయటకు వచ్చిన యువతి మాట్లాడుతుండగానే వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. యువతి అరుపులతో అలెర్ట్ అయిన పేరెంట్స్ అడ్డుకునేందుకు యత్నించడంతో తల్లి పైన కూడా దాడి చేశాడు. యువతి పై దాడి చేసి పారిపోయేందుకు యత్నించిన షారుఖ్ ను పట్టుకున్న స్థానికులు నార్సింగి పోలీసులకు అప్పగించారు.