హైదరాబాద్.. దేశ రెండో రాజధాని ఖాయమే..?

-

దేశ రాజధానిగా హైదరాబాద్ ఉండాలి. దేశ భద్రత, సమైక్యత పరంగా ఇది మంచి నిర్ణయం.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. రాజ్యాంగ రచయిత, దార్శినికుడు డా. బీఆర్ అంబేడ్కర్. ఇప్పుడు ఆయన మాటలు నిజమయ్యేలా ఉన్నాయి. దేశానికి హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలన్న వాదనలు మొదలయ్యాయి.

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య నిలయంగా మారడంతో ఇప్పుడు ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది. దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం అతి ప్రమాదకర స్థాయికి చేరుకుంది.. అక్కడి పరిస్థితులను చూస్తుంటే అంబేడ్కర్ కోరుకున్నట్లుగా బహుశా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ కూడా అభిప్రాయపడ్డారు.

దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేయాలన్న వాదన ఈనాటిది కాదు. తెలంగాణ ఉద్యమం తర్వాత ఉమ్మడి ఏపీ విభజన సమయంలోనూ ఈ డిమాండ్ వెలుగు చూసింది. హైదరాబాద్ పై ఆంధ్ర ప్రాంత నాయకులు పట్టుబట్టిన సమయంలో దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి.. దేశానికి రెండో రాజధాని చేయాలన్న డిమాండ్లు కూడా వచ్చాయి. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ను పూర్తిగా తెలంగాణలో భాగంగానే ఉంచింది.

ఇప్పుడు ఢిల్లీ కాలుష్యం నేపథ్యంలో హైదరాబాద్ దేశ రెండో రాజధాని అన్న వాదనకు మళ్లీ ఊపిరి వచ్చింది. తెలంగాణలో కేసీఆర్ ను కట్టడి చేసేందుకు కూడా ఈ ప్రతిపాదన బీజేపీకి లాభిస్తుందన్న మరో వాదన కూడా ఉంది. అందులో భాగంగానే బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news