హెచ్ ఐవీ కేసుల్లో హైద‌రాబాద్ టాప్‌!

-

హెచ్ ఐవీ కేసుల న‌మోదులో ఉమ్మ‌డి హైద‌రాబాద్ జిల్లా టాప్‌లో నిలిచింది. ఏయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారుల‌ అంచనా ప్ర‌కారం.. ఈ ఏడాది అత్యధికంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా 1944 కేసుల నమోదుతో మొదటి స్థానంలో ఉండగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 1407 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తర్వాతి స్థానంలో రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాలు నిలిచాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 440 కేసులు మాత్రమే నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది కూడా హెచ్ ఐవీ కేసులు ఎక్కువ సంఖ్య‌లో నమోదయ్యాయి. వరుసగా మూడో ఏడాది పదివేల మందికిపైగా ఏయిడ్స్ బారినపడ్డారు. గత ఏడాది 13వేల కేసులు నమోదవగా, ఈ ఏడాది 10,651 కేసులు గుర్తించారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 80,645 కేసులు రికార్డయ్యాయి. ఇంకా గుర్తించని కేసులు 50వేల వరకు ఉంటాయని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. కాగా, ఈ ఏడాది నమోదైన కేసుల వివరాలను నాకో మరో పది రోజుల్లో వెల్లడించనుంది.

గత ఏడాది నేషనల్ ఏయిడ్స్ కంట్రోల్ సొసైటీ లెక్కల ప్రకారం హెచ్ ఐవీ వ్యాప్తిలో మిజోరాం ప్రథమ స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఇక అత్యధికంగా ఎయిడ్స్ మరణాలు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచినట్లు కేంద్రం వెల్లడించింది. ఎయిడ్స్ తో రాష్ట్రంలో 2018-19 సంవత్సరంలో 2,925 మృత్యువాత పడగా, 2019-20లో 4,278 మరణించారు. అయితే పేషెంట్లను త్వరగా గుర్తించకపోవడం, గుర్తించిన వారు మందులు సరిగ్గా వాడకం పోవడంతో మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం కింద అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నది. క్యాంపులు పెట్టి అనుమానితులకు టెస్టులు చేస్తున్నది. ఏఆర్టీ సెంటర్లు ద్వారా రోగులకు మందులు అందజేస్తున్నది. కాగా, ప్ర‌స్తుతం కొవిడ్ నేపథ్యంలో క్యాంపులు వాయిదా వేశారు. కరోనా తగ్గుముఖం పడితే జనవరి నుంచి టెస్టింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news