పంజాబ్‌పై హైద‌రాబాద్ ఘ‌న విజ‌యం..!

-

దుబాయ్‌లో గురువారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 22వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ఘ‌న విజ‌యం సాధించింది. హైద‌రాబాద్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో పంజాబ్ త‌డ‌బ‌డింది. ఆ జ‌ట్టు ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోతూ వ‌చ్చింది. దీంతో పంజాబ్‌పై హైద‌రాబాద్ 69 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

hyderabad won by 69 runs against punjab in ipl 2020 22nd match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైద‌రాబాద్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 201 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. హైద‌రాబాద్ బ్యాట్స్‌మెన్ల‌లో ఓపెన‌ర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్న‌ర్‌లు అద్భుతంగా రాణించారు. మొద‌టి వికెట్ కు వారు ఏకంగా 160 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని జోడించారు. జానీ బెయిర్‌స్టో 55 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 97 ప‌రుగులు చేయ‌గా, వార్న‌ర్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 52 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ జ‌ట్టు భారీ స్కోరు చేయ‌గ‌లిగింది. ఇక పంజాబ్ బౌలర్ల‌లో ర‌వి బిష్ణోయ్ 3 వికెట్లు తీయ‌గా, అర్ష‌దీప్ సింగ్ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ష‌మీకి 1 వికెట్ ద‌క్కింది.

అనంతరం బ్యాటింగ్ చేప‌ట్టిన పంజాబ్ 16.5 ఓవ‌ర్ల‌కే 132 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఆలౌట్ అయింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో నికోలాస్ పూర‌న్ మిన‌హా ఎవ‌రూ రాణించ‌లేదు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స‌ర్ల‌తో 77 ప‌రుగులు చేసిన పూర‌న్ జ‌ట్టును ఆదుకునే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ మిగిలిన బ్యాట్స్‌మెన్ నుంచి అత‌నికి స‌హ‌కారం ల‌భించ‌లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను పారేసుకున్నారు. దీంతో ఆ జ‌ట్టు ఓట‌మి పాలైంది. ఇక హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ 3 వికెట్లు తీసి పంజాబ్ ప‌త‌నాన్ని శాసించాడు. అలాగే ఖ‌లీల్ అహ్మ‌ద్‌, న‌ట‌రాజ‌న్‌లు చెరొక 2 వికెట్ల‌ను తీశారు. అభిషేక్ శ‌ర్మ‌కు 1 వికెట్ ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Latest news