గత సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లో స్తబ్దుగా ఉన్న గృహ మార్కెట్లో ప్రస్తుతం భారీగా గిరాకీ పెరుగుతోందని ఇటీవల ప్రాప్‌టైగర్ వెల్లడించిన నివేదిక ద్వారా తెలిసింది. దక్షిణ భారత దేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఇది అత్యధికంగా ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. 2020 అక్టోబరు, నవంబర్ల నెలల్లో విక్రయాలతో పాటు, నూతన ప్రారంభాలు కూడా ఎక్కువగానే కనిపించాయని పేర్కొంది. భారతదేశంలో ప్రారంభమైన కొత్త ప్రాజెక్టుల్లో హెదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోనే 43 శాతం వరకు ఉన్నాయని, అమ్మకాలు సైతం 29 % వరకు ఇక్కడే కొనసాగాయని స్పష్టం చేసింది.
మిగతా అన్ని నగరాల్లో ధరలు తగ్గుతుంటే.. హైదరాబాద్‌లో మాత్రం రోజురోజుకూ ధరల్లో పెరుగుదల కనిపిస్తోందని తెలిపింది. హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివద్ధితో పాటు, అంతర్జాతీయ సంస్థల ప్రాజెక్టులే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. అయితే.. అక్టోబరు, డిసెంబరు మధ్య కాలంలో అధిక సంఖ్యల్లో ప్రాజెక్టులు హైదరాబాద్‌లోనే ప్రారంభమయ్యాయని పేర్కొంది. ఈ కాలంలో భాగ్యనరంలో కొత్తగా 12,723 నివాస గృహాలు నిర్మించగా, దాదాపుగా 6,487 ఇళ్లు అమ్ముడుపోయినట్లు తెలిపింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో కార్యాలయాలు, ఆఫీసుల పరంగా గిరాకీ అధికంగా ఉంది. భాగ్యనరగంలో ఏడాదిలో దాదాపుగా 5 % వరకు ధరలు పెరిగాయని ప్రాప్‌టైగర్ నివేదిక స్పష్టం చేసింది.