భీమవరం మాజీ ఎమ్మెల్యే పి ఆంజనేయులు జనసేన పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… రాజకీయ పార్టీ పెట్టడానికి తాను సొంత అన్నయ్యను కాదనుకొని బయటకు వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఆయనను ఇబ్బంది పెట్టి వచ్చానని తెలిసినప్పటికీ ఆశయం కోసం నిలబడితే ముందూ వెనుక చూడను అని స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచిస్తా అని అన్నారు. పొత్తులలో భాగంగా తక్కువ సీట్లు తీసుకున్నానని అనుకోవట్లేదు అని తెలిపారు. నా దృష్టిలో టీడీపి, జనసేన, బీజేపి పార్టీలూ 175 చోట్ల పోటీ చేస్తున్నట్లే. ఈసారి వైసీపీని పక్కన పెట్టకపోతే రాష్ట్రంతో పాటు దేశానికీ హాని కలుగుతుంది’ అని జనసేనాని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే… మూడు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ నిన్న కుదిరిన సంగతి తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. బీజేపి 10 అసెంబ్లీ, ఆరు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా, జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో , రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది.2019 ఎన్నికల్లో జనసేన, బీజేపీ ,టిడిపి పార్టీలు ఒంటరిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే .