ఢిల్లీలో జగన్ వెంటే ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి.. కారణం అదేనా..?

-

జగన్ ఓవైపు ఢిల్లీ పర్యటనలో ఉండగా.. అక్కడ ఆయన వెంట సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మీడియా కూడా ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్న విషయం విదితమే. అందులో భాగంగానే జగన్ ప్రధాని మోదీని కలిసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్రం ఖర్చు చేసిన రూ.5103 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసేందుకు గాను ఎప్పటికప్పుడు ఆర్థిక సహాయం అందించాలని అడిగారు. ఇక పోలవరంపై తయారుచేసిన కార్యాచరణ ప్రణాళికను జగన్ మోదీకి అందజేశారు. అలాగే గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు తరలించే ప్రతిపాదనను కూడా జగన్ మోదీ ఎదుట ఉంచారు. దీంతోపాటు ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించేలా జీఎస్‌టీ, ఆదాయపు పన్నుల్లో రాయితీలను ఇవ్వాలని కూడా జగన్ మోదీని కోరారు.

ias srilaxmi seen with ys jagan in delhi

అయితే జగన్ ఓవైపు ఢిల్లీ పర్యటనలో ఉండగా.. అక్కడ ఆయన వెంట సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మీడియా కూడా ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. శ్రీలక్ష్మి ప్రస్తుతం తెలంగాణలో విధి నిర్వహణలో ఉండగా, ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడికి బదిలీ అవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇక ఈ విషయమై ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణను కోరింది. శ్రీలక్ష్మిని ఏపీకి బదిలీ చేయాలని అడగ్గా.. అందుకు కేసీఆర్ కూడా అంగీకరించారు. దీంతో ప్రస్తుతం ఈ అంశం కేంద్ర హోం శాఖ వద్ద పరిశీలనలో ఉంది. అయితే ఢిల్లీలో శ్రీలక్ష్మిని వెంట బెట్టుకుని జగన్ ప్రధాని మోదీని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కాగా శ్రీలక్ష్మిని ఏపీకి బదిలీ చేయించే విషయమై జగన్ ఆమెను వెంట బెట్టుకుని ప్రధానిని కలిశారా..? అన్న సందేహాలు కూడా ఇప్పుడు అందరిలోనూ వస్తున్నాయి.

కాగా గతంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మి విచారణను ఎదుర్కొని జైలు పాలయ్యారు. అయితే చివరకు ఆమెను కోర్టు నిర్దోషి అని ప్రకటించడంతో ఆమె ఊపిరి పీల్చుకుని మళ్లీ విధుల్లో చేరారు. ఈ క్రమంలో ఏపీలో జగన్ సీఎం కావడంతో ఇప్పుడు ఆమె ఏపీకి వెళ్లేందుకు యత్నిస్తున్నారు. కాగా 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మి గతంలో వైఎస్సార్ హయాంలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అయితే జైలుకు వెళ్లడం వల్ల ఆమె కెరీర్‌పై ఆ ప్రభావం పడింది. నిజానికి ఆమె జీవితంలో ఆ మచ్చ లేకుండా ఉంటే ఈపాటికి ఆమె కేంద్ర కేబినెట్ కార్యదర్శి హోదాలో ఉండేవారు. కానీ ఆ కేసు వల్ల శ్రీలక్ష్మి కెరీర్‌కు కొన్నాళ్లు బ్రేక్ పడింది. అయితే తన కోసం జైలుకు వెళ్లొచ్చిన శ్రీలక్ష్మికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే జగన్ ఆమెను మళ్లీ ఏపీకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని సమాచారం. మరి శ్రీలక్ష్మి ఆశలు ఫలిస్తాయా, లేదా.. చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news