కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి, మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీని ఒకేసారి అమలు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వమే మహిళలకు నెల రూ.2 వేల పెన్షన్ సరిగ్గా ఇవ్వలేకపోయిందని.. ఒక్కొ నెల అసలు పెన్షన్ ఇవ్వలేదన్నారు. అలాంటిది మహిళలకు నెలకు రూ.2500 పెన్షన్ ఇస్తామని.. అమలు చేయలేని హామీలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోస్తం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో రూ.2500 పెన్షన్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఆయన సిట్టింగ్ స్థానమైన హుజురాబాద్ తో పాటు గులాబీ బాస్ కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు చోట్ల (హుజురాబాద్, గజ్వేల్) ఈటల రాజేందర్ ఓటమి పాలయ్యారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజిగిరి నుండి బీజేపీ అభ్యర్థిగా ఈటల బరిలోకి దిగుతున్నారు.