కరోనాపై పోరులో ముందుండి సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలన్న ఆదేశాలను మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, త్రిపుర రాష్ట్రాలు పాటించడం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా యోధులకు వేతనాలు చెల్లించాలన్న ధర్మాసనం ఆదేశాల ప్రకారం జూన్ 18న అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఈ నాలుగు రాష్ట్రాలు ఉత్తర్వులు పాటించలేదని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో నిస్సహాయంగా చూస్తూ ఉండకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఆదేశాలు అమలయ్యేలా చూసుకోవాలని స్పష్టం చేసింది. దీనితో పాటు వైద్య సేవల సిబ్బంది క్వారంటైన్ సమయాన్ని సెలవు రోజులుగా పరిగణించి వేతనాలు తగ్గించే విషయంలో అనుసరిస్తున్న విధానంపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.
పిటిషనర్ అరూషీ జైన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్.. జూన్ 18న కేంద్రం జారీ చేసిన ఆదేశాలు హేతుబద్దంగా లేవని కోర్టుకు విన్నవించారు. అధిక ముప్పు, తక్కువ ముప్పు అంటూ కేంద్రం చేసిన వర్గీకరణకు సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఇప్పటికీ వైద్య సిబ్బందికి వేతనాల చెల్లింపు జరగడం లేదని వెల్లడించారు.