ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవన్ లో ఇవాళ ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఇందులో మోడీని ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎన్నికల ముందు ప్రతిపక్షాలు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేశాయని, తాజా ఫలితాలు వారి నోళ్లు మూయించాయని ప్రధాని మోదీ అన్నారు. ‘ప్రజాస్వామ్య శక్తి అంటే ఇదే. ఇక నుంచి ఐదేళ్ల పాటు ఈవీఎంలపై ఆరోపణలు వినిపించవని అనుకుంటున్నాను. కానీ 2029 ఎన్నికల ముందు విపక్ష నేతలు మళ్లీ ఈవీఎంల గురించి ఆరోపణలు చేస్తారు. అలా చేస్తే దేశం వారిని ఎప్పటికీ క్షమించదు’ మోడీ అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే… ఎన్డీఏ సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ని ప్రధాని మోదీ ఆకాశానికెత్తారు. అయితే, జనసేనకు ఇద్దరు ఎంపీలే ఉన్నప్పటికీ మోదీ అంతలా ఎందుకు పొగిడారనే చర్చ జరుగుతోంది. ఏపీలో జనసేన, బీజేపీ , తెలుగుదేశం పార్టీలను ఓ చోటుకు తీసుకొచ్చేందుకు ఆయన తీవ్రంగా శ్రమించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా ప్రతిపక్షాలను ఓ చోటుకు చేర్చారు. పార్టీ నేతలను ఒప్పించి కూటమిగా ఏర్పడి భారీ మెజారిటీతో ఎంపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు.