మరి కొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులకు సీఎం జగన్ కీలక సూచనలు చేశారు.దేశంలోనే విశ్వసనీయత ఉన్న పార్టీ వైసీపీ మాత్రమేనని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.వైసీపీ పార్టీ నేతలతో ఈ రోజు నిర్వహించిన ‘మేము సిద్ధం.. బూత్ సిద్ధం’ వర్క్ షాప్ లో సీఎం పాల్గొన్నారు. ‘ఎన్నికల ప్రచారంలో విపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. రాజకీయాల్లో విశ్వసనీయత చాలా ముఖ్యం. చేయలేని హామీలతో గతంలో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలను మోసం చేశారు అని విమర్శించారు. ఆయనకు విశ్వసనీయత లేదు. మళ్లీ మన ప్రభుత్వం గెలిస్తే వాలంటీర్ల ద్వారా సుపరిపాలన అందిస్తాం అని స్పష్టం చేశారు. లేదంటే మళ్లీ జన్మభూమి కమిటీల అరాచకాలు మొదలవుతాయి’ అని పేర్కొన్నారు.
2014లో చంద్రబాబు నాయుడు హామీలన్నీ మోసపూరితమని సీఎం జగన్ మండిపడ్డారు. ‘మనం రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాం అని, చేయగలిగిందే మనం చెప్పాలి కాని చేయలేనిది చెప్పకూడదు అని సూచించారు. వైసీపీ ఎప్పటికీ అలాంటి సాధ్యం కాని హామీలు ఇవ్వదు అని తెలిపారు. మోసం ఎప్పుడూ నిలబడదు. మోసపూరిత హామీలిచ్చిన చంద్రబాబు పరిస్థితి 2019లో ఏంటి? క్యాడర్ కూడా ప్రజల్లోకి వెళ్లలేని స్థితికి దిగజారింది అని అన్నారు. మనం మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేశాం’ అని జగన్ స్పష్టం చేశారు.