మనం నివాసం ఉండే ఏ ఇల్లు అయినా సరే వాస్తు శాస్త్రం ప్రకారం సరిగ్గా నిర్మింపబడి ఉండాలి. లేదంటే వాస్తు దోషం కలుగుతుంది. ఆ తరువాత ఆ ఇంట్లో నివాసం ఉండే అందరికీ అనేక సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా కింద తెలిపిన పలు సమస్యలు ఉంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లు తెలుసుకోవాలి. మరి ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఇంట్లోని కుటుంబ సభ్యులు చీటికీ, మాటికీ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారంటే.. ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లే లెక్క.
2. ఆర్థిక సమస్యలు బాగా ఉండడం, మానసిక ఆందోళనలు, చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రావడం వంటి సమస్యలు ఉంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లు తెలుసుకోవాలి.
3. ఏ పని చేసినా కలసి రాకపోవడం, ఎక్కడికి వెళ్లినా సమస్యలు ఎదురు కావడం.. తదితర సూచనలు కనిపించినా ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లు నిర్దారించుకోవాలి.
4. అప్పులు బాగా చేయడం, సంతానం కలగకపోవడం, దంపతులు విడిపోవడం, తగాదాలు రావడం.. తదితర సమస్యలు ఉంటే కచ్చితంగా వాస్తు దోషం ఉన్నట్లేనని అర్థం చేసుకోవాలి.
మరి వాస్తు దోషం ఉన్నట్లు తెలుసుకుంటాం.. సరే.. దాన్ని ఎలా పోగొట్టుకోవాలి ? అంటారా.. అందుకు కింద తెలిపిన సూచనలు పాటించండి. దాంతో వాస్తు దోషం పోతుంది. సమస్యలు అవే తగ్గిపోతాయి. మరి ఆ సూచనలు ఏమిటంటే…
1. వాస్తు దోషాన్ని తొలగించుకోవాలంటే ఇంట్లో కచ్చితంగా పూజ గది ఏర్పాటు చేసుకోవాలి. పూజగది లేకపోతే ఇంట్లోనే ఏదో ఒక చోట పూజ గదిలా అమర్చుకోవాలి. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక పూజ మందిరాలు లభిస్తున్నాయి. వాటిని పూజ గదిలా మార్చుకోవచ్చు. పూజ గది ఉన్న ఇంట్లో వాస్తు దోషం ఉండదు.
2. ఇంట్లో ఏదైనా ఒక మూల కుండ ఉంచి అందులో నీళ్లు నింపి దాని వద్దే దీపం వెలిగించాలి. రోజూ ఇలా చేస్తే వాస్తు దోషం పోయి సమస్యలు తొలగిపోతాయి.
3. బ్రహ్మజెముడు, నాగజెముడు లాంటి ముళ్ల జాతికి చెందిన మొక్కలను ఇంట్లో, ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి.
4. ఇంటికి సంబంధించిన ద్వారాలకు ఉండే తలుపులు ఏవైనా సరే.. తెరిస్తే అవి బయటకు ఉండరాదు. లోపలికి రావాలి.
5. ఇంట్లో ఉన్న ద్వారాలకు చెందిన తలుపులను తీసేటప్పుడు, వేసేటప్పుడు కిర్రుమనే శబ్దాలు అస్సలు రాకూడదు.
6. ద్వారాలను తెరిస్తే అవి మన కుడి చేతి వైపుకు వచ్చేలా ఉండాలి.
7. క్షుద్ర దేవతలు, దెయ్యాలు, ప్రమాదాలను సూచించే ఫొటోలు, చిహ్నాలను ఇంట్లో ఉంచుకోరాదు.
8. ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా వినాయకుడు లేదా లక్ష్మీదేవి చిత్రపటాలను ఉంచాలి. నిత్యం బయటకు వెళ్లేటప్పుడు ఆ దైవాలను ప్రార్థించే బయటకు వెళ్లాలి.
9. ఇంట్లో ఎక్కడ కూడా నీరు లీక్ కాకుండా చూసుకోవాలి.
10. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉండే లైట్ కాంతివంతంగా వెలిగేలా చూసుకోవాలి.