ప్రజలకు మంచి రోడ్లు కావాలంటే వారు డబ్బులు చెల్లించాల్సిందేనని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మంచి రోడ్లు ఉంటే త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని, దీంతో ఎంతో సమయం, ఇంధనం ఆదా అవుతాయని అన్నారు. కనుక అలాంటి రోడ్లు కావాలంటే ప్రజలకు ఉచితంగా రావని, అందుకు డబ్బులను చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
గురువారం ఆయన ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వే అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్స్ప్రెస్ వేకు సమీపంలో ఉన్న రైతులు తమ భూములను డెవలపర్లకు అమ్మాల్సిన పనిలేదని, అందుకు బదులుగా వారు డెవలపర్లతో భాగస్వామ్యం కావచ్చని, దీంతో రహదారుల పక్కన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి వాహనదారులకు సేవలను అందిస్తూ డబ్బులను సంపాదించుకోవచ్చని అన్నారు.
టోల్ చార్జిల వల్ల ప్రయాణ ఖర్చులు పెరిగాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి గడ్కరీ సమాధానమిస్తూ.. మీకు ఎయిర్ కండిషన్డ్ హాల్ కావాలంటే డబ్బు చెల్లించాల్సిందే. అదే బయట మీకున్న స్థలంలోనూ మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అది ఉచితంగానే. కానీ సదుపాయాలతో కార్యక్రమం చేస్తామంటే అందుకు డబ్బులను చెల్లించాల్సిందే కదా.. అన్నారు.
ఎక్స్ప్రెస్ వే ల వల్ల ప్రయాణం సమయం గణనీయంగా తగ్గుతుందని మంత్రి గడ్కరీ అన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే వల్ల 48 గంటల ప్రయాణం 18 గంటలకు తగ్గుతుంది. దీంతో ట్రక్కు ఓనర్లు మరిన్ని ట్రిప్పులు వేయవచ్చని, దీని వల్ల మరింత వ్యాపారం జరుగుతుందన్నారు.