శ్రీ కూర్మ క్షేత్రాభివృద్ధికి సత్వర కృషి

-

  • ఎమ్మెల్యే ధర్మాన హామీ
  • నూతన పాలకమండలికి అభినందన
  • నిత్యాన్నదానం పథకం ప్రారంభానికి
    సన్నాహాలు
  • త్వరలో ఆలయ ప్రాంగణాన శ్రీకారం
  • దాతల సమన్వయంతో మహా క్రతువు

ధర్మాన క్యాంప్ ఆఫీస్ (శ్రీకాకుళం నగరం) : ఆది కూర్మావతారం వెలసిన క్షేత్రం, ప్రసిద్ధ పుణ్య ధామం శ్రీ కూర్మ క్షేత్రాభివృద్ధికి సత్వర కృషికి అంతా సన్నద్ధం కావాలని శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.ఇందుకు తనవంతు సాయం తప్పక ఉంటుంది అని హామీ ఇచ్చారు.స్థానిక క్యాంపు ఆఫీసులో కొత్తగా నియమితులయిన పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావును మర్యాదపూర్వకంగా సోమవారం కలిసి, ఆయనకు ఆత్మీయ సత్కారం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆలయ అభివృద్ధితో పాటు, క్షేత్ర ప్రాశస్త్యం మరింత మందికి తెలిసేందుకు పాలక మండలి దృష్టి సారించాలని కోరారు.

అదేవిధంగా ఆలయ ప్రాంగణాన ఉన్న కోనేరు అభివృద్ధికి, ఇంకా నిత్యాన్నదాన కార్యక్రమ ఆరంభానికి సంబంధించి కూడా కొన్ని సూచనలు చేశారు.పాలక మండలితో ఆలయానికి సంబంధించి అనేక విషయాలు చర్చించారు.ఆలయ ఆస్తుల పరిరక్షణ, అన్యాక్రాంతంలో ఉన్న భూములు గుర్తింపు, తదనంతర చర్యలు వీటన్నింటిపై కూడా సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుని పనిచేయాలని చెప్పారు.సుదీర్ఘ కాలం తరువాత పాలక మండలి ఏర్పాటు శుభ పరిణామం అని, అదేవిధంగా దాతల సహకారం అందుకుని నిత్యాన్నదాన పథకం ఆరంభానికి శ్రీకారం దిద్దేందుకు పాలకమండలి యోచన చేయడం బాగుందని కితాబిచ్చారు.

ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని, చారిత్ర నేపథ్యం దృష్ట్యా ఈ ఆలయం ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిందని,పితృకాండలకు ప్రసిద్ధి చెందిన ఆలయంగానే కాకుండా, రాష్ట్రంలోనే ఏకైక ఆది కూర్మ క్షేత్రంగా వినుతికి ఎక్కిందని గుర్తు చేసుకున్నారు.విశిష్టాద్వైతం అలరారిన ప్రదేశం ఇది అని అన్నారు.వీటన్నింటి దృష్ట్యా క్షేత్రంకు ఉన్న గొప్పదనం మరింత పెంపొందించేందుకు పనిచేయాలని కోరారు. అనంతరం తమను పాలక మండలి సభ్యులుగా నియమించినందుకు సంబంధిత బాధ్యులంతా ధర్మానకు కృతజ్ఞతలు తెలిపారు.

పాలక మండలి సభ్యులు వీరే..

పాలక మండలి చైర్మన్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు వ్యవహరించనుండగా,సభ్యులుగా డబ్బీరు శ్రీనివాసరావు,ముంజేటి అప్పలకొండ,బోర కృష్ణవేణి,కొండ లక్ష్మి,అనుపోజు నాగరాజు,ఉప్పాడ రమేష్, పూడి కమల,గోరు శ్యామలరావు, సిహెచ్.సీతారామ నర్సింహ చార్యులు వ్యవహరించనున్నారని ప్రభుత్వం తరఫున విడుదలయిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ట్రస్ట్ బోర్డ్ ప్రత్యేక ఆహ్వానితులుగా పొన్నాడ రుషి నియమితులయ్యారు. చైర్మన్ మినహా పాలక మండలి సభ్యులు,ప్రత్యేక ఆహ్వానితులు ఇవాళ ధర్మానను కలిసిన వారిలో ఉన్నారు.

కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్.విజయకుమార్, వైసీపీ నాయకులు అంబటి శ్రీనివాసరావు, నాటక అకాడమీ డైరెక్టర్ ముంజేటి కృష్ణ, వైస్ఎంపిపి బరాటం రామశేషు, సర్పంచ్ గోరు అనిత, నర్సింహులు, చిట్టి రవికుమార్, ఉటపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news