ప్ర‌త్యేక హోదా : థాంక్యూ కేసీఆర్…

-

ఇవాళ ఆంధ్రాకు ప్రత్యేక హోదా ద‌క్క‌డం గురించే ఏక‌ధాటిగా,అన‌ర్గ‌ళ రీతిలో కొంద‌రు బీజేపీ నాయ‌కులు మాట్లాడుతున్నారు.కానీ ఈ ప్రత్యేక హోదాకి సంబంధించి మనకు అంటే ఆంధ్రాకు కాస్తోకూస్తో సహాయం చేసినటువంటి కేసీఆర్ ను  మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన ఢిల్లీ రాజకీయాలలో గత కొద్ది కాలంగా చక్రం తిప్పుతున్నారు.కీల‌క నిధుల విష‌య‌మై,ఇత‌ర ఆర్థిక సంబంథ ప్ర‌యోజ‌నాల విష‌య‌మై, ప‌న్నుల వాటాల విష‌య‌మై బిజెపితో తగువు పెట్టుకుంటున్నారు.రాష్ట్రాల‌కు ద‌క్కాల్సిన లేదా ద‌ఖ‌లు ప‌డాల్సిన హ‌క్కుల గురించి అదే ప‌నిగా పోరాడుతున్నారు.వీటిపైనే గంట‌లు గంట‌లు త‌ర‌బ‌డి మీడియా మీట్లు నిర్వ‌హిస్తున్నారు.

ఈ క్రమంలో రాష్ట్రం విడిపోయాక కేంద్రం నుంచి ఒక్క‌టంటే ఒక్క విద్యా సంస్థ గాని లేదా ఇతర పరిశోధనా సంస్థ  గాని తమ ప్రాంతానికి మంజూరు కాలేదు అని ఆవేదన చెందుతున్నారు.ఇదే దశలో ఆంధ్రకు కూడా అన్యాయం జరిగిందని కేసీఆర్ అంటున్నారు.ఆవేద‌న చెందుతున్నారు.ఆంధ్రకు జరిగిన అన్యాయంపై మాట్లాడాల్సిన ఆ ప్రాంత నాయకులు కన్నా కేసీఆర్ చొరవ తీసుకుని మాట్లాడుతున్నారు.కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నారు.ఇదే ఇవాళ రాజ‌కీయాల్లో వ‌చ్చిన లేదా రానున్న కీల‌క మార్పు కూడా!

విభజన కారణంగా తాము ఏ విధంగా నష్టపోయే ఏమో అన్నది తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉత్తరాల రూపంలో కేంద్రానికి వివ‌రిస్తూ వస్తున్నారు.ఇదే సమయంలో తాము ఏ విధంగా ఆర్థిక ప్రయోజనాలు అందుకోకుండా ఉన్నామో అన్న‌ది కూడా గ‌ణాంకాల‌తో స‌హా వివరిస్తున్నారు.కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని,గ‌డిచిన ఏడేళ్ల కాలంలో నిధుల కేటాయింపు కూడా బాలేద‌ని కేటీఆర్ అంటున్నారు.మ‌రోవైపు జగన్ మాత్రం పార్లమెంట్లో బీజేపీకి అనుగుణంగానే, అనుబంధంగానే నడుచుకోవాలని త‌న ఎంపీల‌కు చెబుతున్నారు.ఈ నేప‌థ్యంలో ఒకవేళ ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తే అందులో కొంత క్రెడిట్ మాత్రం తెలంగాణ సీఎంకు చెందుతుంది.ఎందుకంటే తెలంగాణ ప్ర‌భుత్వం విభజన చట్టం అమ‌లుకు సంబంధించి ఎన్నో విషయాలను పార్లమెంట్ కేంద్రంగా పట్టుబడుతోంది.పోరాట స్ఫూర్తి చాటుతోంది.అందుకే ఆంధ్రా త‌ర‌ఫున తెలంగాణ సీఎంకు ఓ కృత‌జ్ఞ‌త..ఓ ధ‌న్య‌వాద…

– ర‌త్న‌కిశోర్ శంభుమహంతి

Read more RELATED
Recommended to you

Latest news