సిద్ధార్థడు.. జ్ఞానం ఆర్జించిన తర్వాత గౌతముడుగా బుద్దుడుగా మారాడు. సిద్ధార్థుడు కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. గౌతమ అనేది సిద్ధార్థుడి ఇంటిపేరు కాదు, సిద్దార్థుడిని పెంచిన తల్లి గౌతమి పేరు అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. గౌతముడి తండ్రి పేరు శుద్దోధనుడు, తల్లి మహామాయ, సిద్ధార్థుడు గర్భంలో ఉన్న సమయంలో మాయాదేవికి ఒక కల వచ్చింది అందులో ఒక ఆరు దంతాల ఏనుగు తన గర్భంలోకి కుడివైపు నుండి ప్రవేశించినట్లుగా వచ్చింది. అది జరిగిన పది చంద్రమానముల తరువాత మహామాయాదేవి తన తండ్రిగారి ఇంటికి బయలుదేరింది, కానీ మార్గమధ్యంలో లుంబిని ప్రాంతంలో ఒక సాలవృక్షం క్రింద సిద్ధార్థుడు జన్మించాడు.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని అన్నట్టుగా సిద్ధార్థుడు పుట్టిన వెంటనే ఏడు అడుగుల దూరం నడిచి జనన మరణాల వల్ల లోకంలో సంభవిస్తున్న దుఃఖాన్ని నిర్మూలం చేస్తాను అని పలికాడట. ఆ సమయంలో ఆకాశంలో ఒక దివ్యజ్యోతి వెలిగింది అనీ, చెవిటివారు మాటలు వినగలిగారనీ, మూగవారు మాట్లాడారని, కుంటివారు నడిచారని చెబుతారు. మాయాదేవి సిద్ధార్థుడు జన్మించిన ఏడవ రోజున మరణించింది. ఆ రోజు నుండి శుద్దోధనుడి రెండవ భార్య గౌతమి సిద్ధార్థుడిని తన కడుపులో పెట్టుకుని పెంచింది. గౌతమి తన బిడ్డడిని బయటకు పంపించకుండా రాజప్రసాదంలోనే ఉంచి అతనికి వినోదం కలిగించడం కోసం నలభైవేలమంది నటులను నియమించింది.
సిద్ధార్థుడు యుక్త వయస్కుడు కాగానే అతనికి వివాహం చేయాలని నిశ్చయించారు శుద్దోధనుడు, గౌతమి. అందుకు కాను దేశంలోని అయిదు వందల క్షత్రియ కన్యలను రప్పించగా సిద్ధార్థుడు తాను మహామంత్రి మహానాముని కుమార్తె యశోధరను వరించాడు. కానీ మహామంత్రి శాక్యధర్మం ప్రకారం వీరవిక్రమ విహారంలో సర్వరాజకుమారులను జయించిన వారికే తన కుమార్తెను పెళ్ళి చేసుకోవడానికి అనుమతి ఇస్తాను అని చెప్పడంతో. సిద్ధార్థుడు వివిధ క్షత్రియ విద్యలలో తనకు గల ప్రావిణ్యం ప్రదర్శించి యశోధరను పరిణయమాడాడు. సిద్ధార్థుడికి రాహులుడు అని ఒక కుమారడు కలిగాడు. ఇది సిద్దార్థుడి బాల్యం, యవ్వన విశేషాలు.
– శ్రీ