వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరాన్ని ధరించే సంప్రదాయం ఉంది. ఇంతకీ ఈ తోరాన్ని ఎందుకు, కట్టుకోవాలో తెలుసుకుందాం…
అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ, సకల విజయాలూ కలగాలని కట్టుకునేదే తోరం. అలా ధరించే తోరం సంతానాన్నీ, సంపదను, సౌభాగ్యాన్నీ ప్రసాదిస్తుందని విశ్వాసం… వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం మూడు తోరాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, మరొకటి ముత్తయిదువకు అన్నమాట. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవసూత్రం అని పిలుస్తారు. ఆ పేరుని బట్టే ఇందులో తొమ్మిది దారాలు, తొమ్మిది ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం నవగ్రహాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుంది. అందుకే నవసూత్రం కట్టుకుంటారు. కొందరు ఐదు ముడులు కూడా వేసుకుంటారు. ఇలా కట్టుకున్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలన్నీ సిద్ధిస్తాయి. ఈ నవ సూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని తొమ్మిది పోగులుగా చేయాలి. అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలి. ఆ తోరానికి తొమ్మిది చోట్ల కుంకుమ రాసి, అలా రాసిన చోట ఒకో పూవుని ఉంచుతూ తొమ్మిది ముడులు వేయాలి. ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి పూజించాలి.
దీనినే తోరగ్రంథిపూజ అంటారు. తోరంలోని ఒకో ముడినీ అక్షతలతో కానీ, పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథి పూజ. ఇందుకోసం..
ఓం కమలాయై నమ: ప్రథమగ్రంథిం పూజయామి
ఓం రమాయై నమ: ద్వితీయ గ్రంథిం పూజయామి
ఓం లోకమాత్రే నమ: తృతీయ గ్రంథిం పూజయామి
ఓం విశ్వజన్య నమ: చతుర్థ గ్రంథిం పూజయామి
ఓం మహాలక్ష్మైనమ: పంచమ గ్రంథిం పూజయామి
ఓం క్షీరాబ్దితనయామై నమ: షష్టి గ్రంథిం పూజయామి
ఓం విశ్వసాక్ష్యి నమ: సప్తమ గ్రంథిం పూజయామి
ఓం చంద్రోసహోద్య నమ: అష్టమ గ్రంథిం పూజయామి
ఓం హరివల్లభాయై నమ: నవమ గ్రంథిం పూజయామి అని చదువుతూ ఒకో ముడినీ పూజించాలి. అనంతరం పెద్దలు, ముత్తెదువుల ఆశీర్వాదం తీసుకోవాలి. దీపానికి, తులసీ చెట్టు వద్ద నమస్కారం చేస్తే మరి మంచిది.
– కేశవ