కురిచేడులో వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పై కరపత్రాల కలకలం సృష్టించాయి. దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి కుటుంబ సభ్యులు నరసరావుపేట, సత్తెనపల్లిలో కోడెల కుటుంబ సభ్యులలా అరాచకాలకు పాల్పడుతున్నారంటూ కురిచేడు కాలువ వంతెన సమీపంలో పాంప్లెట్లను విసిరి వెళ్ళారు కొందరు వ్యక్తులు. నియోజకవర్గం లోని వర్కులకు కార్యకర్తల దగ్గర 12 శాతం, సీఎంఆర్ఎఫ్ కు 30 శాతం కమిషన్ తీసుకుని టీడీపీ వారికి పనులు ఇస్తున్నారని ఆరోపణలు చేసారు.
చందవరం, పులిపాడుతో పాటు పలు చెరువులను లీజులకు తీసుకోవాలంటే తమకు లక్షల్లో కమిషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ వెల్లడించారు. పొలాల్లో వెంచర్లు వేసిన వారి వద్ద కూడా కమిషన్లు అడుగుతున్నారంటూ ఆరోపణలు చేసారు. ఐదు మండలాల్లో ఐదుగురు ఇన్ ఛార్జ్ లను నియమించి టీడీపీ అనునాయులకు పనులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వైఖరి వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్ట పోతుందంటూ కరపత్రంలో ముద్రించారు.