సుస్థిరతకే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పెద్దపీట వేశారని, సుస్థిరతను కోరుకుంటున్నామనే సందేశాన్ని ఎన్నికలు ఫలితాలు చాటిచెప్పాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో 2 రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని శుక్రవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ…బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడాన్ని ప్రస్తావిస్తూ, సుస్థిర ప్రభుత్వమనే కొత్త శకంలోకి దేశం అడుగుపెట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ఫలితాలు చూపెట్టిందని, పనితీరు ఆధారంగానే ప్రజలు 60 సంవత్సరాల తర్వాత వరుసగా మూడోసారి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తెలిపారు.
తమకంటే ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ప్రస్తావిస్తూ, గత శతాబ్దంలోని చివరి దశాబ్దంలో అస్థిర ప్రభుత్వాలను చూశామనీ,10 సంవత్సరాలలో 5 సార్లు ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. ఇలాంటి అస్థిరత, అనిశ్చితి సమయంలో ఇండియాను ముందుకు తీసుకువెళ్తేందుకు తాము పగ్గాలు చేపట్టామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.