భద్రతా దళాలు గురువారం నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులను కాల్చి చంపినా సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్ లోని నాగ్రోటాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారిని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) పిలిచింది. తమ భూభాగం నుండి పనిచేస్తున్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం మానేయాలని డిమాండ్ చేస్తూ భారత్ పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
జమ్మూ జిల్లాలోని నాగ్రోటా పట్టణానికి సమీపంలో హైవేపై ఉన్న బాన్ టోల్ ప్లాజా వద్ద గురువారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించి ఉగ్రవాదుల సమాచారంతో పాటుగా వారు వాడిన ఫోన్ లకు సంబంధించిన వివరాలను కూడా పాకిస్తాన్ కి భారత్ ఇచ్చింది. నాగ్రోటా ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా, ఇంటెలిజెన్స్ స్థాపనలతో పిఎం మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు.