ప్రముఖ మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్.. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌కు పంచ్ వేశారు. కరోనాతో ఓ వైపు జనాలు అల్లాడిపోతుంటే.. ఇలాంటి సమయంలో క్రికెట్ ఆడడం అవసరమా..? అని కపిల్.. షోయబ్‌కు చురకలంటించారు. భారత్, పాకిస్థాన్‌లలో కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు డబ్బు అవసరం అవుతుందని.. కనుక.. ఇరు దేశాలు దుబాయ్‌లో ఓ సిరీస్ ఆడితే వచ్చే డబ్బుతో రెండు దేశాల్లోనూ కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవచ్చని షోయబ్ తాజాగా అన్నాడు. అయితే ఇందుకు కపిల్ తనదైన శైలిలో కౌంటర్ వేశారు.
భారత్‌కు కరోనాను అడ్డుకునేంత సామర్థ్యం ఉందని, అందుకు తగ్గ డబ్బు కూడా ఉందని.. దాని కోసం క్రికెట్ ఆడాల్సిన పనిలేదని కపిల్ అన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ప్రస్తుతం కలసి కట్టుగా పోరాడి కరోనా మహమ్మారిని తరిమికొట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భారత్‌కు డబ్బులు అవసరం లేదని కపిల్ అన్నారు. కాగా బీసీసీఐ ఇప్పటికే పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.51 కోట్ల విరాళం ప్రకటించగా.. పలువురు క్రికెటర్లు కూడా విరాళాలు ఇచ్చారు.
ఇక భారత్ మరో 6 నెలల వరకు క్రికెట్ ఆడకుండా ఉంటేనే బాగుంటుందని కపిల్ అన్నారు. దుబాయ్‌లో 3 గేమ్స్ ఆడితే ఎంత డబ్బు వస్తుంది..? అది ఎందుకూ సరిపోదని కూడా కపిల్ అన్నారు. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో క్రికెట్ ఆడకపోవడమే ఉత్తమమని ఆయన అన్నారు.