దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వినియోగం అంతకంతకు పెరుగుతోంది. పెట్రోల్, డిజిల్ రేట్లు విపరీతంగా పెరుగుతుండటంతో సగటు వాహన వినియోగదారుడు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి మొగ్గుచూపుతున్నాడు. దీంతో దేశంలో గణనీయంగా ఈవీ ల సంఖ్య పెరుగుతోంది. గత వారం వరకు భారతదేశంలో మొత్తం 10,60,707 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయని, దేశంలో 1,742 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు (పిసిఎస్) పనిచేస్తున్నాయని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మార్చి 23న పార్లమెంటుకు తెలియజేశారు
రానున్న కాలంలో జాతీయ రహదారులపై ఛార్జింగ్ స్టేషన్లను పెంచుతామని గడ్కరీ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువగా బైకులు, కార్లు అమ్ముడవుతున్నాయి. ప్రతీ వాహన కంపెనీ కూడా తన ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తులను పెంచుతున్నాయి. దీంతో పాటు ఛార్జింగ్ స్టేషన్లకు అవసమయ్యే అన్ని సౌకర్యాలను కల్పించేందుకు వివిధ వాహన కంపెనీలు పెట్రోల్ కంపెనీలతో టైఆప్ అవుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో కూాడా మరింతగా ఈవీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.