మన దేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. అయినా సరే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో అర్ధం కావడం లేదు. దాదాపుగా అన్ని దేశాల్లో కూడా వ్యాక్సిన్ అత్యవసర వినియోగం ఆయా ప్రభుత్వాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మన దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ ఒక కీలక ప్రకటన చేసారు.
జనవరిలో భారత ప్రజలు కోవిడ్ -19 వ్యాక్సిన్ షాట్ పొందవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఆదివారం అన్నారు. మా మొదటి ప్రాధాన్యత టీకాల భద్రత మరియు అది ప్రభావం చూపించడం అని ఆయన అన్నారు. తమకు దానిపై రాజీ పడటం ఇష్టం లేదు అని స్పష్టం చేసారు. నా వ్యక్తిగత భావన ప్రకారం జనవరి ఏ వారంలోనైనా, భారతదేశ ప్రజలకు మొదటి కోవిడ్ వ్యాక్సిన్ షాట్ ఇచ్చే అవకాశం ఉంది అని అన్నారు.
ఇంతలో, టీకాపై బహిరంగ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం, ఆరు కరోనావైరస్ వ్యాక్సిన్లు భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని కేంద్రం పేర్కొంది. అవి వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక కరోనా వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలు సిద్దమవుతున్నాయి.