భారత్ – పాకిస్తాన్ మధ్య కొనసాగిన ఉద్రిక్తతలకు ఎట్టకేలకు ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం శనివారం తక్షణ కాల్పుల విరమణను ప్రకటించింది. ఈ ప్రకటన అనంతరం, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉగ్రవాదంపై భారత్ ధృఢమైన వైఖరిని మరోసారి స్పష్టంచేశారు. జైశంకర్ ట్వీట్ చేస్తూ, “ఉగ్రవాదాన్ని భారత్ ఏ రూపంలోనూ సహించదు. అది ఎక్కడి నుంచైనా, ఎలాంటి ముసుగులో వచ్చినా, దాన్ని భారతదేశం తీవ్రంగా ఎదుర్కొంటుంది. భారత్–పాకిస్తాన్ మధ్య ఈరోజు ఒక అవగాహన ఏర్పడింది. భూభాగం, గగనం, సముద్ర మార్గాల్లో అన్ని రకాల సైనిక చర్యలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది శాంతికి దోహదపడే చర్యగా పరిగణించొచ్చు. అయితే ఉగ్రవాదంపై భారత్ దృఢంగా ఉండబోతుంది,” అని స్పష్టం చేశారు.
ఇక విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రి వెల్లడించిన వివరాల ప్రకారం, ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్ల డైరెక్టర్లు మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు టెలిఫోన్ సంభాషణ జరిగింది. అందులో భూమి, గగనం, సముద్రం ప్రాంతాల్లో జరిగిన సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి అమలులోకి వచ్చినట్లు తెలిపారు. ఇక ఈ పరిణామానికి కొద్దిసేపటి ముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటనను ముందుగానే వెల్లడించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ కాల్పుల విరమణ సాధ్యమైందని ఆయన పేర్కొనడం గమనార్హం.