భారత్- శ్రీలంక (India-Sri Lanka) మధ్య జులై 13 నుంచి జరగాల్సిన వన్డే సిరీస్ ఐదు రోజులు ఆలస్యంగా జరగనుంది. శ్రీలంక జట్టులో కరోనా కేసులు బయటపడడంతో సిరీస్ రీషెడ్యూల్ చేయాలని లంక క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనను ముగించుకున్న శ్రీలంక జట్టు స్వదేశానికి వచ్చి క్వారంటైన్లో ఉంది. క్వారంటైన్లో ఉన్న సమయంలో శ్రీలంక జట్టులో ఇద్దరు వైరస్ బారిన పడ్డారు. ముందుగా బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ కాగా.. శుక్రవారం ఆ జట్టు డేటా అనలిస్ట్ జీటీ నిరోషన్ వైరస్ బారిన పడ్డారు. దీంతో జట్టు సభ్యుల క్వారంటైన్ పొడిగించాలని శ్రీలంక బోర్డు నిర్ణయం తీసుకుంది.
జులై 13 నుంచి జరగాల్సిన వన్డే సిరీస్ ను జులై 18వ తేదీ నుంచి జరపనున్నట్లు రెండు దేశాల క్రికెట్ బోర్డులు తెలిపాయి. జులై 18వ తేదీన మొదటి వన్డే, 20వ తేదీన రెండో వన్డే, 23వ తేదీన మూడో వన్డే జరుగనుంది. అలానే జులై 25,27,29 తేదీల్లో వరుసగా మూడు టీ20లు జరగనున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జులై 13, 16, 18 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు, 21, 23, 25 తేదీల్లో వరుసగా మూడు టీ20ల జరగాల్సి ఉంది.