కరోనా లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ఇండియన్ల కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలను నడపనున్న సంగతి తెలిసిందే. మే 7 నుంచి 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక విమానాలను నడిపిస్తారు. ఇక ఈ తరలింపు భారత్‌లో గతంలో ఎన్నడూ లేని అతి పెద్ద తరలింపు కాగా.. ఇందుకోసం ఏకంగా 64 విమానాలను కేటాయించారు. ఆయా విమానాలు పలు మార్గాల్లో వెళ్లి విదేశాల్లో ఉన్న ఇండియన్లను వెనక్కి తీసుకురానున్నాయి.
విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం నడపనున్న ప్రత్యేక విమానాల్లో… యూఏఈకి 10, ఖతార్‌కు 2, సౌదీ అరేబియాకు 5, యూకేకు 7, సింగపూర్‌కు 5, అమెరికాకు 7, ఫిలిప్పీన్స్‌కు 5, బంగ్లాదేశ్‌కు 7, బహ్రెయిన్‌కు 2, మలేషియాకు 7, కువైట్‌కు 5, ఒమన్‌కు 2 వెళ్లనున్నాయి. దీంతో మొత్తం 64 విమానాలు ఆయా దేశాలకు వెళ్తాయి. ఇక ఆయా రూట్లకు గాను నిర్దేశించిన టిక్కెట్ ధరలు ఇలా ఉన్నాయి.
* లండన్ నుంచి ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ నగరాలకు వచ్చే విమానాల్లో టిక్కెట్ ధరను రూ.50వేలుగా నిర్ణయించారు.
* చికాగో, ఢిల్లీ, హైదరాబాద్ విమాన టిక్కెట్ ధర రూ.1 లక్ష వరకు ఉంది.
* బంగ్లాదేశ్‌లోని ఢాకా నుంచి ఢిల్లీకి రూ.12వేలు టిక్కెట్ ధర వసూలు చేస్తారు.
ఇక ఆయా విమానాల్లో వచ్చేందుకు ప్రయాణికులు వారి టిక్కెట్ ధరలను వారే భరించాల్సి ఉంటుంది. అలాగే పైన తెలిపిన విమానాలే కాకుండా దోహా నుంచి భారత్‌కు రెండు ప్రత్యేక విమానాలను నడపనున్నారు. ఈ క్రమంలో మే 7వ తేదీన మొదటి విమానం దోహా నుంచి కొచ్చికి రానుంది. తరువాత మే 10వ తేదీన 2వ విమానం దోహా నుంచి తిరువనంతపురంకు చేరుకుంటుంది. విమానాల్లో వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులలో స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే విమానాల్లో తీసుకువస్తారు. వచ్చాక పరీక్షలు జరిపి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతారు.