భారత్.. వ్యవసాయం ప్రధానంగా ఉన్న దేశం.. దేశంలో అనేక మంది రైతులు మన దేశ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. మన దేశ జీడీపీలో 16 శాతం వ్యవసాయ రంగానిదే. ఇక ఈ రంగం వల్ల దేశంలోని జనాభాలో దాదాపుగా 50 శాతం మందికి ఉపాధి లభిస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ ఉన్నప్పటికీ ఈ ఒక్క రంగం మాత్రమే 100 శాతం కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇక లాక్‌డౌన్ వల్ల పతనమైన ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు మరో ఏడాది అయినా పట్టేందుకు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నందున.. అప్పటి వరకు మన దేశాన్ని వ్యవసాయ రంగమే ఆదుకుంటుందని.. లాక్‌డౌన్ వల్ల వచ్చిన నష్టాన్ని కూడా.. వ్యవసాయ రంగమే భర్తీ చేస్తుందని.. పలువురు అంటున్నారు.
మన దేశంలో మానుఫాక్చరింగ్ పర్చేస్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్ నెలలో 27.4 శాతంగా నమోదైంది. నిజానికి ఈ శాతం ఇంత తక్కువగా నమోదు కావడం 2005 మార్చి తరువాత ఇదే తొలిసారి. సాధారణంగా పీఎంఐ 50 శాతం కన్నా తక్కువగా ఉంటే.. పరిస్థితి సమస్యాత్మకమని భావిస్తారు. ఇక కన్ఫడెరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) చేపట్టిన ఓ సర్వే ప్రకారం.. దేశంలోని ప్రముఖ కంపెనీలకు చెందిన సీఈవోలు కరోనాకు ముందున్న స్థితి మన దేశంలో వచ్చేందుకు కనీసం ఏడాది పడుతుందని 45 శాతం మంది చెప్పగా, మరో 36 శాతం మంది అందుకు 6 నుంచి 12 నెలలు సమయమైనా పడుతుందని చెప్పారు. అంటే.. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడాలంటే.. ఎంతలేదన్నా కనీసం.. 12 నెలల వరకైనా ఆగాలన్నమాట. ఇక అప్పటి వరకు 100 శాతం పనిచేసే రంగం ఏదైనా ఉంది అంటే.. అది వ్యవసాయ రంగమే. అందుకనే ఇప్పుడు భారత్ ఆ రంగంపై ఆశలు పెట్టుకుంది.
ఇక వ్యవసాయ రంగానికి చెందిన ఇతర గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే.. ఈ రంగం 2020-21 ఆర్థిక సంవత్సరానికి 3 శాతం వృద్ధిని సాధిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ రంగం వల్ల దేశ జీడీపీ ఈసారి అదనంగా మరో 0.5 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సారి రికార్డు స్థాయిలు ధాన్యాలు పండాయని లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఆహార ధాన్యాలు, ఆహారేతర ధాన్యాల ఉత్పత్తి ఈసారి గణనీయంగా పెరిగినట్లు మనకు స్పష్టమవుతుంది. ఇవన్నీ భారత వ్యవసాయ రంగం అభివృద్ధిని సాధిస్తుందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు. అందువల్లే భారత్ ఈసారి లాక్‌డౌన్ వల్ల వ్యవసాయ రంగం పైనే ఎక్కువగా ఆధార పడాల్సి ఉంటుందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉండవచ్చని ఐఎండీ చెబుతోంది. దీంతోపాటు వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న రంగాలకు పనిచేసేందుకు అనుమతులు ఇవ్వడంతో.. ప్రస్తుతానికి ఈ రంగంలోనే ఎక్కువగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇక ఇతర అన్ని రంగాలు కుంటు పడినా.. వ్యవసాయ రంగం మాత్రం తన పనితాను చేసుకుపోతుండడం భారత్‌కు కలసి వచ్చే అంశం. దీంతో భారత్ లాక్‌డౌన్ వల్ల తనకు కలిగే నష్టాన్ని కొంత వరకైనా పూడ్చుకుంటుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఏది ఏమైనా.. వ్యవసాయిక దేశం అయినందున భారత్‌కు మేలే జరిగిందని చెప్పవచ్చు..!