కోవిడ్ 19 కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆరోగ్య సేతు యాప్‌ను ఇకపై ప్రతి ఒక్కరూ తమ తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందే. కాదు, కూడదు.. అని కహానీలు చెప్పరాదు. అలా చేస్తే.. రూ.1వేయి ఫైన్ కట్టాల్సి ఉంటుంది. లేదా 6 నెలల పాటు జైలుకైనా వెళ్లాలి. అవును ఇది నిజమే.. అయితే ఈ రూల్ దేశవ్యాప్తంగా కాదు, ప్రస్తుతానికి కేవలం నోయిడాలోనే అమలవుతోంది.
నోయిడా, గ్రేటర్ నోయిడాలలో ఇకపై స్మార్ట్‌ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ను కచ్చితంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ క్రమంలో పోలీసులు చెక్‌పోస్టులు పెట్టి మరీ ఈ యాప్‌ను ప్రజలు ఇన్‌స్టాల్ చేసుకున్నారా, లేదా అనే వివరాలను చెక్ చేయనున్నారు. అయితే మొబైల్ డేటా లేక యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోలేని వారికి పోలీసులే స్వయంగా హాట్‌స్పాట్ ఇవ్వనున్నారు. ఇక స్టోరేజ్ లేకపోతే వెంటనే ఆ సమస్యను సాల్వ్ చేసుకుని ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. అది కూడా కుదరని పక్షంలో ఆ పౌరుడి ఫోన్ నంబర్‌ను పోలీసులు తీసుకుంటారు. తరువాతైనా ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారా, లేదా అనే వివరాలను పోలీసులే స్వయంగా అడిగి తెలుసుకుంటారు.
ఇక నోయిడాలో అమలవుతున్న ఈ రూల్‌ను పాటించకపోతే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం వ్యక్తులపై కేసు నమోదు చేస్తారు. అనంతరం వారిని మెజిస్ట్రేట్ వద్దకు తరలిస్తారు. ఇక న్యాయమూర్తి వారికి రూ.1000 వరకు ఫైన్ లేదా 6 నెలల వరకు జైలుశిక్ష విధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో నోయిడా, గ్రేటర్ నోయిడాలలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ స్మార్ట్‌ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ను కచ్చితంగా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందేనని.. అక్కడి పోలీసులు చెబుతున్నారు.