అధిక జనాభా కలిగిన దేశం ఇండియా.. ఇక్కడ పేదరికం, ఉపాధి లేకపోవడంతో పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలసలు పోవడం సర్వసాధారణం… అయితే ఇదే దేశంలో ఉపాధి లేకపోతే ఎక్కడి పోవాలి… అందుకే ఇండియాలో ఎక్కువగా ఉన్న నిరుద్యోగులు ఉపాధి కోసం విదేశాల బాట పడుతున్నారు. అందులో విదేశాలకు ఉపాధి కోసం వలసలు పోతున్నవారిలో ప్రపంచ దేశాల్లో అత్యధికులు భారతీయులే కావడం గమనార్హం. భారతదేశాన్ని వదిలి విదేశాలకు వలస పోయిన వారిలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 17మిలియన్ల కార్మికులు ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ గణాంకాలు తెలుపుతున్నాయి.
స్వదేశంలోనే తమ కుటుంబాలను వదిలి జీవనోపాధికి పొట్ట చేత పట్టుకుని ప్రపంచంలోని అనేక దేశాలకు వెళ్ళిన దేశాల నివేదికను ప్రపంచ బ్యాంక్ ఐక్యరాజ్యసమితికి ఇచ్చిన నివేదిక వెల్లడిస్తుంది. ఇక్కడ ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా జీవనోపాధికి వెళ్ళిన భారతీయులు అత్యధికంగా తమ కుటుంబాలకు డబ్బు పంపడంలో కూడా మొదటి స్థానంలో ఉన్నారని ప్రపంచ బ్యాంక్ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.
17 మిలియన్ల కార్మికులు గతేడాది సుమారుగా 79 బిలియన్ డాలర్లు సంపాదించిన సొమ్మును భారత్‌లోని తమ కుటుంబాలకు విదేశీ రెమిటెన్స్ రూపంలో పంపారని నివేదిక వెల్లడిస్తుంది. ఇలా సంపాదించిన సొమ్ము తమ కుటుంబాలకు పంపడంలో, జీవనోపాధి పొందడంలో అత్యధికులు ఇండియన్లు ఉన్నారని నివేదిక లో పేర్కోన్నారు. అయితే ఉపాధి కోసం వలస పోయిన వారిలో చైనా రెండో స్థానంలో ఉంది. 10 మిలియన్ వలసదారులున్న చైనా పౌరులు సంపాదించిన సొమ్ము 67 బిలియన్ డాలర్లు సంపాదించి తమ కుటుంబాలకు పంపారని నివేదికలో వెల్లడించారు.
ఇంతలా వలస కార్మికులు తమ కుటుంబాలకు సొమ్ము పంపిస్తున్నా దేశ స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ)లో 2.7 శాతానికి సమానంగా ఉందని నివేదికలో తెలిపారు. అదే విధంగా విదేశీ చెల్లింపులపై ప్రధానంగా ఆధారపడుతున్న దేశాలకు ప్రపంచ బ్యాంక్ ర్యాంకులు ప్రకటించడం విశేషం. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ర్యాంక్‌ల ఆధారంగా 2017లో 2.5బిలియన్ డాలర్లను ప్రవాసుల ద్వారా సంపాదించిన కిర్గిస్తాన్ మొదటి స్థానంలో నిలిచారు. ఇక నేపాల్ వలస కార్మికులు తాము సంపాదించిన 6.9 బిలియన్ డాలర్ల (28 శాతం) తో స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలలో క్రియాశీలక పాత్ర పోషించారట.
2017లో అన్ని దేశాలు 483 బిలియన్ డాలర్ల విదేశీ చెల్లింపులు పొందగా, 2018లో మాత్రం 529 బిలియన్ డాలర్లలుగా తేలింది. అంటే గతం కన్నా ఈసారి 46 బిలియన్ డాలర్లను అధికంగా విదేశీ చెల్లింపులు జరిగాయని ప్రపంచ బ్యాంక్ నివేదిక తేటతెల్లం చేసింది. అయితే భారత్ తన కుటుంబాలకు పంపిన సొమ్ము చిన్న దేశాలతో పోల్చితే చాలా స్వల్పమేనని తేలింది.